ఫుట్‌బోర్డ్‌ ప్రయాణం సాగిస్తూ నలుగురు మృతి

– మరో ఐదుగురికి గాయాలు
– చెన్నైలోని సెయింట్‌ థామస్‌మౌంట్‌ రైల్వేస్టేషన్‌లో విషాధ ఘటన
చెన్నై, జులై24(జ‌నంసాక్షి): బస్సులో అయినా, రైలులోనైనా ఫుట్‌బోర్డు ప్రయాణం ఎప్పుడూ ప్రమాదకరమే. ప్రస్తుతం మెట్రో నగరాల్లో ఫుట్‌బోర్డ్‌ ప్రయాణం సర్వసాధరణమైపోయింది. మహా నగరాల్లో ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయంలో.. మళ్లీ సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు బస్సులు, లోకల్‌ రైళ్లు కిక్కిరిసిపోయి ఉంటాయి. సమయానికి ఆఫీసుకి, లేదంటే ఇంటికి వెళ్లాలనే తొందరలో ప్రమాదకరమని
తెలిసినా చాలా మంది ఫుట్‌బోర్డ్‌ ప్రయాణం చేస్తున్నారు. ఇలా ప్రయాణించి ప్రాణాల విూదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన ఘటన ఫుట్‌బోర్డ్‌ ప్రయాణం ఎంత ప్రమాదకరమో చెబుతోంది. రైల్వే స్టేషన్‌లోని రెండు ప్లాట్‌ఫాంల మధ్య ఉన్న కాంక్రీట్‌ గోడ తగలడంతో ఫుట్‌బోర్డ్‌పై వేలాడుతూ ప్రయాణిస్తున్నవారిలో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటన చెన్నైలోని సెయింట్‌ థామస్‌ మౌంట్‌ స్టేషన్‌లో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. చెన్నై బీచ్‌ నుంచి తిరుమల్‌పూర్‌ వెళ్తున్న లోకల్‌ ట్రైన్‌ జనంతో కిక్కిరిసిపోయింది. రద్దీ సమయం కావడంతో చాలా మంది ఫుట్‌బోర్డుపై వేలాడుతూ ప్రయాణిస్తున్నారు. ఉదయం 8.45 గంటలకు సెయింట్‌ థామస్‌ మౌంట్‌ స్టేషన్‌ వద్దకు రైలు వచ్చింది. అయితే సిగ్నల్‌ కారణంగా ఎప్పుడూ ఆగే ప్లాట్‌ఫామ్‌పై కాకుండా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగే ప్లాట్‌ఫాంపైకి రైలు వెళ్లింది. ఈ ప్లాట్‌ఫాం వద్ద రెండు పట్టాల మధ్య కాంక్రీట్‌ గోడ ఉండటంతో అది తగిలి వేలాడుతున్న ప్రయాణికులంతా కింద పడిపోయారు. ఒకరిపై ఒకరు బలంగా పడడంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని రోయెపట్టా జనరల్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. మరో ముగ్గురిని రాజీవ్‌ గాంధీ జనరల్‌ హాస్పిటల్‌కు తరలించారు. రైలు 15 నిమిషాలు ఆలస్యంగా నడవడం వల్లే జనం కిక్కిరిసోయారని, ప్రమాదానికి రైల్వే శాఖ నిర్లక్ష్యమే కారణమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా రెండు పట్టాల మధ్య ఉన్న గోడను తొలగించాలని చెన్నై ఎప్పటి నుంచో కోరుతున్నా రైల్వే అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా రైల్వే శాఖ స్పందించి ప్రమాదాలకు కారణమవుతోన్న గోడను తొలగించాలని కోరుతున్నారు.