ఫైనాన్స్‌ వ్యాపారి గగారిన్‌ మృతి

కాలిన గాయాలతో మృత్యువుతో పోరాటం

విజయవాడ,నవంబర్‌26(జ‌నంసాక్షి): ఈ నెల 23వ తేదీన ప్రత్యర్థుల చేతిలో హత్యాయత్నానికి గురైన ఫైనాన్స్‌ వ్యాపారి దేవరపల్లి గగారిన్‌ మృతి చెందారు. కాలిన గాయాలతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం అర్థరాత్రి మరణించారు. మూడురోజులుగా ఆయన పోరాడిని లాభం లేకుండా పోయింది. విజయవాడకు చెందిన ఫైనాన్స్‌ వ్యాపారి దేవరపల్లి గగారిన్‌ కొద్దినెలల క్రితం మద్దాలి ప్రసాద్‌ అనే వ్యక్తి నుంచి ఆస్తి కొనుగోలు చేశారు. అయితే ఆ ఆస్తి విక్రయంలో ప్రసాద్‌, ఆయన తనయుల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో గగారిన్‌ కొనుగోలు చేసిన ఆస్తిని ప్రసాద్‌ కుమారులు సురేష్‌, సుధాకర్‌లు ఆక్రమించారు. సదరు ఆస్తిని దక్కించుకునేందుకు గతంలో గగారిన్‌పై దాడి చేశారు. దీంతో గగారిన్‌ మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకొని చేతులు దులుపుకున్నారు. పోలీసుల వల్ల న్యాయం జరగకపోవడంతో గగారిన్‌ కోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి గగారిన్‌కు అనుకూల తీర్పు వస్తుందనే ఉద్దేశంలో దుండగులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం విజయవాడలోని గవర్నర్‌ పేట సవిూపంలో గగారిన్‌పై ఆ ఇద్దరు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. అనంతరం నిందితులు అక్కడినుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలయిన గగారిన్‌ ఆస్పత్రిలో చికిత్స పొందినా లాభం లేకుండా పోయింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.