ఫైవ్‌స్టార్‌ శ్మశానం!

556644108 మీటర్ల అందమైన భవనం.. 35 అంతస్తులతో ఆకాశానికి చేతులు చాచే ఎత్తు.. చుట్టూ అరుదైన చెట్లతో నిండిన ఉద్యానవనాలు.. అందులో ముచ్చటగొలిపే వాటర్‌ ఫౌంటేన్‌లు.. నెమలి పార్క్‌.. ఓ జలపాతం.. ఆకలి తీర్చే ఫలహారశాల.. ప్రార్థనలు చేసుకోవటానికి ఓ పెద్ద చర్చి.. సేద తీరడానికి లగ్జరీ రూమ్‌లు.. ఇవన్నీ చూస్తుంటే అదేదో ఖరీదైన ఏ ఫైవ్‌స్టార్‌ హోటలో అనుకుంటున్నారు కదా! కానేకాదు. ఇది ఓ శ్మశానం. అవాక్కయ్యారా? కానీ మీరు విన్నది నిజమే.

బ్రెజిల్‌లోని సాంటోస్‌లో ఈ శ్మశానం ఉంది. దీనిపేరు ‘మెమోరియల్‌ నెక్రోపోల్‌ ఎక్యుమెనికా’. 1986లో ఈ శ్మశానాన్ని నిర్మించారు. కానీ అప్పట్లో ఇది చాలా చిన్నది. క్రమేపీ దీనిని విస్తరించాలని నిర్ణయించుకున్న స్థానికులు.. అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఎంతలా అంటే దానిని చూస్తే నిజంగా ఫైవ్‌స్టార్‌ హోటలనే భావన కలుగుతుంది. ఆధునిక ఆకాశ హర్మ్యాలకి ఏమాత్రం తీసిపోని భవనం అది.

25,000 మృతదేహాలు ఇమిడిపోయే సామర్థ్యంతో దీనిని నిర్మించారు. ఇందులో ఉన్న 32 ఫ్లోర్లలో ఒక్కో ఫ్లోర్‌కి దాదాపు 150 సమాధులు,అందులో ఒక్కోదానిలో ఆరు మృతదేహాలు పడతాయి. ఇందులో సమాధి చేసే మృతదేహాలు దాదాపు 3 సంవత్సరాల వరకు పాడవకుండా ఉంటాయట.

దీని ముందే ఓ పెద్ద చర్చి ఉంది. ఖననం చేసేముందు అధిక సంఖ్యలో పాల్గొని ప్రార్థనలు చేసుకోవడానికి అందులో అవకాశం ఉంది. అయితే ఈ భవనంలో కావాల్సిన అంతస్తుల్లో మృతదేహాల్ని భద్రపరుచుకోటానికి 5వేల నుంచి 20,000 డాలర్ల వరకు ఖర్చవుతుందట. మరి ఫైవ్‌స్టార్‌ శ్మశానం కదా ఆమాత్రం ధర ఉండదా? ఆకాశ హర్మ్యంలా ఉండే ఈ శ్మశానం.. గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానం సంపాదిస్తుంది.

ఇదే లేటెస్ట్‌ ఈ ఫైవ్‌స్టార్‌ శ్మశానం కథ.