బంగారం స్మగ్లింగ్‌లో కొత్త ఎత్తులు

బెల్టు రూపంలో తరలిస్తుండగా పట్టుకున్న అధికారులు

చెన్నై,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): బంగారం అక్రమ రవాణ కోసం స్మగ్లర్స్‌ కొత్తఎత్తులు వేస్తున్నాఅధికారులకు చిక్కుకుంటూనే ఉన్నారు. పసిడిని అక్రమంగా తరలించేందుకు యత్నించి అధికారులకు పట్టుబడుతున్నారు. ఇటీవల శంషాబాద్‌ విమానాశ్రయంలో ఓ వ్యక్తి బంగారాన్ని ఎవరికి అనుమానం రాకుండా కరిగించి అందులో రసాయనాలు కలిపాడు. అనంతరం దాన్ని పేస్ట్‌గా మార్చి మెత్తటి కడ్డీలుగా రూపొందించి తరలిస్తుండగా డిఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. తాజాగా చెన్నై విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడు కరిగించిన బంగారంతో తయారుచేసిన బెల్ట్‌ ధరించి కస్టమ్స్‌ అధికారులకు పట్టుబడ్డాడు. ఆ వ్యక్తి నుంచి రూ.20 లక్షల విలువైన ఈ బెల్ట్‌ ను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి చెన్నై విమానాశ్రయానికి ఆదివారం తెల్లవారుజామున వచ్చిన ప్రయాణికుల లగేజీ కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేస్తుండగా నగరానికి చెందిన షేక్‌ హుస్సేన్‌ అనే యువకుడుని అనుమానంతో స్కానింగ్‌ గదికి తీసుకెళ్లి సోదాలు చేశారు. అతను ధరించిన బెల్ట్‌ పరిశీలించగా అందులో బంగారం ఉన్నట్లు తేలింది. దాంతో హుస్సేన్‌ను అదుపులోకి తీసుకుని అతడి నుంచి వెండి పూతతో ఉన్న 680 గ్రాముల బంగారం బెల్ట్‌ ను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు.