బంగారుబాతుగుడ్డు మైదుకూరు మున్సిపాలిటీ

 

కౌన్సిలర్లకు కల్పవృక్షంగా మారిందన్న సిపిఎం

కడప,నవంబర్‌21(జ‌నంసాక్షి): మైదుకూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై సిపిఎం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శివకుమార్‌ అన్నారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. మైదుకూరు మున్సిపాలిటీ కార్యాలయం అధికార పార్టీ నాయకులకు కౌన్సిలర్లకు కల్పవృక్షంలా మారిందని, ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ప్రజల నుండి పన్నుల రూపంలో వచ్చే నిధులు ఎవరికి వారు ఇష్టం వచ్చిన రీతిలో దోచుకుంటున్నారని విమర్శించారు. మరుగుదొడ్ల నిర్మాణంలో కోట్ల రూపాయల నిధులు స్వాహా చేశారని బాధితులతో కలిసి సిపిఎం పార్టీ ఆందోళన చేస్తే మరుగుదొడ్లకు సంబంధించిన రికార్డులు తమ దగ్గర లేవని చెబుతున్నారని దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అన్నారు. మున్సిపాలిటీ అధికారులు కొంతమంది కౌన్సిలర్లు కలిసి ప్రజల సొమ్మును పంచుకుంటున్నారన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని కార్డులకు సంబంధించిన అభివృద్ధి పనులు వివరాల కోసం సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేస్తే ఇప్పటికి రెండు నెలలు గడుస్తున్నా ఇవ్వడం లేదని దీనిపై చట్టపరంగా న్యాయస్థానాన్ని లేదా అప్పీలుకు వెళ్తామని తెలియజేశారు. మైదుకూరు మున్సిపాలిటీలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని, కొంతమంది కౌన్సిలర్లు, అధికార పార్టీ నాయకులు మాత్రమే అభివృద్ధి చెందారని ఆరోపించారు. మైదుకూరు మున్సిపాలిటీకి నిధులు వరదల్లా వచ్చాయని చెబుతున్నారని ఆ వరద ఎక్కడ పారిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పట్టణంలో పేదలు నివసిస్తున్న కాలనీలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. అర్బన్‌ రూరల్‌ ప్రాంతాల్లో కనీసం దోమల మందు కూడా చల్లడం లేదని వారు విమర్శించారు. మున్సిపాలిటీలో జరిగిన జరుగుతున్న అవినీతిపై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి షరీఫ్‌, మండల నాయకులు సుబ్బరాయుడు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.