బంగాళాఖాతంలో అల్పపీడనం

విశాఖపట్టణం,జనవరి24(జ‌నంసాక్షి): దాదాపు నెల రోజుల తరువాత దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇదే సమయంలో దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండటం, తెలంగాణపై ఉపరితల ద్రోణి ఏర్పడటంతో మరోసారి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణమే ఉంటుందని, కొన్ని ప్రాంతాలను పొగమంచు కమ్మేస్తుందని చెప్పిన వాతావరణ శాఖ అధికారులు, శుక్రవారం నాడు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని అన్నారు. అల్పపీడనం గమనాన్ని, అది బలపడుతున్న వైనాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.