బదిలీలు పదోన్నతులు షెడ్యూలు వెంటనే విడుదల చేయాలి
టిపిటిఎఫ్ జిల్లా కార్యదర్శి కొమిరె ఉప్పలయ్య.
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్21(జనంసాక్షి)
తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ గార్ల మండల శాఖ ఆధ్వర్యంలో సమస్యల సేకరణ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి కొమిరె ఉప్పలయ్య పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, ప్రభుత్వ విద్యా రంగం సంక్షోభంలో ఉన్నదని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని అందుకు నూతన నియామక నోటిఫికేషన్ విడుదల చేయాలని దానికంటే ముందు బదిలీలు పదోన్నతులు చేపట్టి సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చాలని, గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో బదిలీలు లేవని, గత ఏడు సంవత్సరాలుగా పదోన్నతులు చేపట్టలేదని ఇప్పటికైనా బదిలీల పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని, దసరా సెలవుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా 317 జీవో అప్పీలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇంకా అనేక పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో అందలేదని, సర్వీస్ పర్సన్స్ లేక పాఠశాలలు అపరిశుభ్రంగా ఉంటున్నాయని, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఇతర యాజమాన్యాలలో అన్ని పాఠశాలల సమస్యలు పరిష్కరించాలని, సామాన్యులకు ప్రభుత్వ విద్య అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిపిటిఎఫ్ గార్ల మండల శాఖ బాధ్యులు జి బాలాజీ, పి వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు ఎస్కే మీరా తదితరులు పాల్గొన్నారు.