బయ్యారంలో సైడ్ డ్రైనేజీలు లేక కొన్నిచోట్ల… ఉన్నప్పటికీ పూడికతీత లేక మరికొన్నిచోట్ల… స్థానికుల అగచాట్లు
బయ్యారం,జులై 15(జనం సాక్షి):
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం 2వ వార్డ్ పరిధిలోని ముత్యాలమ్మ వీధిలో గతంలో ఉన్న డ్రైనేజీ సిసి రోడ్ల నిర్మాణ క్రమంలో మట్టితో పూర్తిగా నిండిపోయింది. ఇదే విషయం గురించి స్థానికుడు రాజు(35)తెలిపిన వివరాల ప్రకారం… గత 30 సంవత్సరాల నుండి ఈ వీధిలో సైడ్ డ్రైనేజీ ఉందని, సీసీ రోడ్ల నిర్మాణ క్రమంలో సైడ్ డ్రైనేజీ ని పూర్తిగా మట్టితో కప్పివేశారని, ఇదే విషయమై పలుమార్లు బయ్యారం గ్రామ సర్పంచ్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన ఆరోపించారు. తానిచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం ముత్యాలమ్మ వీధిలోని సైడ్ డ్రైనేజీ గురించి పరిశీలించిన సర్పంచ్ ఇక్కడ ఎటువంటి డ్రైనేజీ పూర్వం లేదని, ఇక్కడ డ్రైనేజీ మళ్లీ తిరిగి నిర్మించాలంటే స్థానికులు ఎటువంటి ఫిర్యాదు చేసిన దానికి పూర్తి బాధ్యత వహిస్తానంటూ కాగితం మీద రాసివ్వాలని అలా అయితేనే తిరిగి నిర్మాణం చేస్తామన్నారని,ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఓటర్లకు ఎలాంటి కాగితాలు రాసిస్తే ఓటేసామని ఇప్పుడు నన్ను హామీ అడుగుతున్నారని వాపోయారు. సైడ్ డ్రైనేజీలు లేకపోవడంతో ఒకరి ఇంటిలోని మురుగునీరు మరొకరు ఇంటి మీదుగా వెళ్లడం వల్ల ఇరుగుపొరుగు వారితో వివాదాలు పెరుగుతున్నాయని, వర్షాకాలం వచ్చే మలేరియా టైఫాయిడ్, డెంగ్యూ వంటి ప్రాణాంతక రోగాల పారిన పడే అవకాశం ఉందని, పిల్లలు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వచ్చే శ్రావణమాసంలో ముత్యాలమ్మ బోనాల జాతర వందలాదిమంది భక్తులు ఈ మార్గం గుండా వెళ్లాల్సిందేనని, కాబట్టి వెంటనే ఈ విషయం మీద స్పందించి ఈ వీధిలో సైడ్ డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.