బయ్యారం గనుల రద్దు
ఖమ్మం, జూన్ 12 (జనంసాక్షి): తెలుగుదేశం పార్టీ చేసిన పోరాటాల ఫలితంగానే బయ్యారం గనుల ఒప్పందం రద్దు జరిగిందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అల్లుడు అనిల్‌కుమార్‌కు చెందిన కంపెనీగా పేరున్న రక్షణ స్టీల్స్‌కు ఖమ్మం జిల్లాలోని బయ్యారం మండలంలో 1.40 లక్షల ఎకరాల్లో అప్పటి ప్రభుత్వం కట్టబెట్టిన లీజును రద్దు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే చెందిందన్నారు. 2009 ఎన్నికలకు ముందు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్ ఎన్నికల కొద్దిరోజుల ముందు హడావుడిగా దొడ్డిదారిన జీవో జారీ చేసిందన్నారు. కానీ కేంద్రప్రభుత్వం నుంచి అప్పటికి ఎలాంటి అనుమతులు రాలేదు. 2010లో తాను పార్లమెంట్‌లో ఈ విషయం లేవనెత్తడంతో అప్పటి కేంద్రప్రభుత్వం అనుమతి రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందన్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ కారణంగా రక్షణ స్టీల్స్ ఖనిజం తవ్వకాలు జరిపి లారీలు, వ్యాగన్‌లలో తరలించిందన్నారు. చివరకు టిడిపి పోరాటం ఫలితంగానే బయ్యారం గనుల ఒప్పందం రద్దయిందని నామా అన్నారు.