బర్లగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు దురద దద్దుర్లు

– తల్లిదండ్రుల ఆందోళన
– బర్లగూడెంలో మెడికల్ క్యాంపు

టేకులపల్లి ,జూలై 29( జనం సాక్షి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం లోని బర్లగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు శరీరంపై దురద మరియు దద్దుర్లు కనబడటంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వారిని వెంటనే మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు.అనంతరం వ్యాధి తీవ్రత కొంచెం తగ్గుముఖం పట్టిన తర్వాత వారిని తిరిగి స్వగ్రామానికి పంపించడం జరిగింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మంకీ ఫ్యాక్స్ తో ఆందోళన చెందుతున్న తరుణంలో విద్యార్థులకు దురద దద్దులు కనబడటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు . పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత దురదలు దద్దుర్లు విద్యార్థులకు కనిపించడంతో భోజనములో విషపూరితమైనది ఏమైనా జరిగి ఉంటుందేమోనని విద్యార్థిని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆందోళన చెందారు వెంటనే మండల పరిధిలో గల సులానగర్ పిహెచ్సికి విద్యార్థినీ విద్యార్థులను హుటా హుటిన తరలించి చికిత్సలు అందించారు. విషయం తెలుసుకున్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ దయానంద స్వామి స్వయంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి పిల్లల ఆరోగ్య స్థితి గతులను తెలుసుకొని, ఈరోజు రాత్రి బర్లగూడెం గ్రామంలో మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది .అలాగే పి.హెచ్.సి సిబ్బందిని కూడా అలర్ట్ గా ఉండమని ఆదేశించడం జరిగింది.