బసగూడ ఎన్‌కౌంటర్ మరో జలియన్‌వాలాబాగ్
అమరవీరుల బంధుమిత్రుల మహాసభలో వరవరరావు
హైదరాబాద్, జూలై 19 (జనంసాక్షి): బాసగూడ ఎన్‌కౌంటర్ కూడా మరో జలియన్‌వాలాబాగ్ ఘటన లాంటిదేనని, మావోయిస్టుల పేరుతో ఆదివాసులను ఊచకోత కోస్తున్నారని విరసం సభ్యుడు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని బాగ్‌లింగంపల్లిలో జరిగిన మావోయిస్టు అమరుల బంధు కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన వరవరరావు ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలుగా అమరుల బంధుమిత్రుల సంఘం ఉన్నత ఆశయంతో ముందుకు సాగుతున్నదని, ఎన్నో స్వప్నాలతో నిరంతరం కృషి చేస్తున్నదన్నారు. 2009 నుంచి ఒడిషా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌హంట్ పేరిట అమాయకులను ఎన్‌కౌంటర్ పేరుతో హత్య చేస్తూ, అక్కడి సహజ వనరులను కొల్లగొట్టడానికి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని వరవరరావు ఆరోపించారు. ఆజాద్, కిషన్‌జీ వంటి ఎందరో విప్లవకారులు ప్రజల కోసం పోరాడుతూ, పాలకుల కుట్రకు అమరులయ్యారని మర్శించారు. బాసగూడ పోరాటం భవిష్యత్తులో నూతన సమాజ ఏర్పాటుకు దోహదం చేస్తుందన్నారు. ఈ మారణకాండలో ఏపీ ఇంటెలిజెన్స్ అధికారుల హస్తముందని అక్కడి పోలీసు అధికారులు తెలిపారని వివరించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడం కూడా గ్రీన్‌హంట్‌లో భాగమేనని, అమరులైన వారి మృతదేహాల కోసం కూడా పోరాటం చేయాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్త చేశారు. కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్‌లో అమరవీరుల స్ఫూర్తిగా ఏర్పాటు చేసిన భారీ స్తూపాన్ని పాలకులు ఓర్వలేక కూల్చి వేశారని వరవరరావు ఆరోపించారు. మరో అతిథి మాయమైన ఉద్యమకారుల కమిటీ ఆధ్యక్షురాలు పర్వీన్ అంగారా మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆచూకీ లేకుండా పోయిన ఉద్యమకారులను వెతకడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఆరోపించారు. సమావేశంలో అమరుల బంధుమిత్రుల కమిటీ కార్యదర్శి పద్మ కుమారి నివేదిక సమర్పించగా, ఆజాద్‌తోపాటు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన జర్నలిస్ట్ హేమచంద్ర పాండే భార్య బబిత, ఏపీసీఎల్‌సీ ప్రొఫెసర్ శేషయ్య, ఒరిస్సా నుంచి వచ్చిన దండపాణి మహంతి తదితరులు హాజరై ప్రసంగించారు.