బహిరంగ మద్యం విక్రయాలుపట్టించుకోని ఎక్సైజ్‌శాఖ అధికారులు
కాకినాడ,నవంబర్11(జనం సాక్షి):వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీ అమలులో దారితప్పుతోంది. మద్యం వ్యాపారంలో ఆ పార్టీ కార్యకర్తలు కొందరు బరి తెగించి మరీ అమ్మకాలు చేస్తున్నారు. ఇతర రాష్టాల్ర నుంచి కూడా మద్యం బాటిల్స్ తెచ్చి బహిరంగంగా విక్రయిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. పబ్లిక్ ప్రాంతాల్లో బహిరంగంగానే విక్రయిస్తున్నా అడిగే అధికారులే కరువయ్యారని ఆరోపిస్తున్నారు. మద్యంషాపులు తెరవని సమయంలో బహిరంగ విక్రయాలు కొనసాగుతున్నాయి. వైసీపీ కార్యకర్తల ఆధ్వర్యంలోనే మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.ఎక్సైజ్, పోలీసుశాఖ అధికారులు పట్టనట్లుగా ఉండడంతో బహిరంగ విక్రయాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ, యానాం ప్రాంతాలనుంచి అక్రమ మద్యం కోనసీమకు తరలివస్తోంది. ఇప్పటికే పలుప్రాంతాల్లోని రహస్య స్థావరాల్లో యానాం మద్యం విక్రయాలు హోరెత్తిపోతున్నా అధికారులు స్పందించని పరిస్థితి ఏర్పడిరది. అటు తెలంగాణ, ఇటు యానాంలో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయించడం ద్వారా లాభాలు ఆర్జిస్తున్నారు.