బాక్సైట్ తవ్వకాల కోసం దొడ్డిదారి ప్రయత్నాలు
విశాఖపట్టణం,ఆగస్ట్9(జనం సాక్షి): గిరిజనుల మనోభావాలకు భిన్నంగా ఏజెన్సీ ప్రాంతంలోని బాక్సైట్ తవ్వకాలు జరిపేందుకు మరోమారు దొడ్‌ఇదారి ప్రయత్నాలు సాగుతున్నాయని సిపిఎం మండిపడింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రతి కుట్రనూ పోరాటాల ద్వారా అడ్డుకుంటామని సిపిఎం జిల్లా కమిటీ పేర్కొంది. అడవిని నమ్ముకొని జీవిస్తున్న గిరిజన బతుకులను ఛిద్రం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని మండిపడింది. వారి జీవితాలు మెరుగుపడడానికి చర్యలు తీసుకోవడంలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం విచారం వ్యక్తం చేశారు. తాజాగా ప్రభుత్వాలు చేస్తున్న ఎత్తుగడలు చూస్తుంటే బాక్సైట్ తవ్వకాల కోసం కొత్తనాటకాలకు ప్రభుత్వాలు తెరదీస్తున్నట్లు కనబడుతోందని విమర్శించారు. గిరిజనుల ప్రయోజనాలరీత్యా బాక్సైట్ తవ్వకాల అనుమతులకు నాల్కో చేసిన దరఖాస్తును తిరస్కరించాలన్నారు. బాక్సైట్ తవ్వకాల కోసం అన్‌రాక్‌తో జరిగిన ఒప్పందాలు, అనుమతులన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల పట్ల చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే బాక్సైట్ తవ్వకాల కోసం విడుదల చేసిన జిఒ 97ను రద్దు చేయాలన్నారు. గిరిజన సంసృతి, సంప్రదాయాలు, బతుకులు, పర్యావరణాన్ని నాశనం చేసే చర్యలను ప్రభుత్వాలు విడనాడాలని హితవు పలికారు. ఆర్థిక ప్రయోజనాల కోసం గిరిజనులకు నష్టం చేకూర్చే బాక్సైట్ తవ్వకాల అనుమతులకు వ్యతిరేకంగా గిరిజనుల పక్షాన పోరాడి బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.