బాధితులకు ఆసరాగా నిలుస్తోన్న సిఎం రిలీఫ్‌ఫండ్
వేయికోట్ల వరకు నాలుగేళ్లలో సాయం
ఎమ్మెల్యేలు పోటీపడి సాయం అందచేత
అమరావతి,ఆగస్ట్13(జనం సాక్షి ): రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వెయ్యి కోట్ల రూపాయలతో లక్షన్నర కుటుంబాలకు సాయం అందుతోంది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తమ నియోజకవర్గ ప్రజలకు బాగా సాయపడాలని ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. వ్యాధితోనో లేదా ప్రమాదం బారినపడో లేదా మరేదైనా కష్టమొచ్చో ఆసుపత్రి పాలై వైద్య ఖర్చులు భరించే స్థోమత లేని వారికి ఈ సాయమందిస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ఇప్పటికే రూ.920 కోట్ల పంపిణీ పూర్తిచేసినట్లు సమాచారం. . మిగతా రూ.80 కోట్ల మొత్తానికి సంబంధించి అవసరమైన పక్రియలు పూర్తయిన అనంతరం ఈ నెలాఖరులోగా అందజేయనున్నట్టు అధికారులు తెలిపారు.వైద్య ఖర్చులకు ప్రభుత్వ చేయూత కోరే వారి నుంచి వచ్చే దరఖాస్తులు పరిశీలించి అర్హులను ఎంపిక చేసి సాయమందించడానికి ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. కొన్ని సందర్భాల్లో విూడియాలో వచ్చే మానవీయ కథనాలనూ సుమోటోగా తీసుకుని తగిన సాయం చేస్తున్నారు. సీఎంవో కార్యదర్శి ఏవీ రాజమౌళి నేతృత్వంలో రామసుబ్బయ్య బృందం ఈ విభాగ బాధ్యతలు చూస్తోంది.2004 నుంచి 2014 వరకూ పదేళ్ల కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ సహాయ నిధి నుంచి రూ.750 కోట్ల మేరకు ప్రజలకు లబ్ధి చేకూరింది. కానీ ఈ నాలుగున్నరేళ్లలోనే కేవలం ఏపీలో అంతకంటే అధికంగా సాయమందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల పరిధిలోని బాధితులకు సాయం అందించేందుకు ఈ నిధిని వినియోగించుకుంటున్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం పరిధిలోని బాధితులకు ఈ నిధి నుంచి అత్యధికంగా రూ.18 కోట్ల మేర సాయం ఇప్పించుకోగలిగారు. గన్నవరం, జగ్గయ్యపేట, విజయవాడ తూర్పు, పెనమలూరు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రూ.15 కోట్లు చొప్పున ఇప్పించుకోగలిగారు. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. సగటున ఒక్కో నియోజకవర్గంలో రూ.5 కోట్ల మేర సాయమందినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా కృష్ణా జిల్లాకు చెందిన 22,463 మంది ప్రయోజనం పొందారు. వారికి రూ.152.48 కోట్ల మేర సాయమందింది. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో గుంటూరు, ప్రకాశం జిల్లాలున్నాయి. ఈ మూడూ పక్కపక్క జిల్లాలు. నాలుగో స్థానంలో ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లా అయిన కడప నిలిచింది. ఈ జిల్లాలో 14,115 మందికి రూ.100.39 కోట్ల మేర సాయమందించారు. కిడ్ని, కాలేయ మార్పిడి చికిత్సలకు సంబంధించి చెన్నై, బెంగళూరుల్లో చికిత్సలు చేయించుకున్న వారికి కూడా మానవతా దృక్పథంతో సుమారు రూ.5 కోట్లు వరకూ చెల్లించారు. వైద్యం అత్యవసరమై డబ్బులు వెచ్చించలేని పరిస్థితిలో ఉంటే బాధితుడి పేరు, వ్యాధి, వైద్యానికయ్యే ఖర్చు తదితర వివరాలతో కూడిన లేఖను ఆసుపత్రి నుంచి సీఎంఆర్‌ఎఫ్(చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్) విభాగానికి పంపిస్తే వైద్యఖర్చుల్లో కొంత మొత్తాన్ని చెల్లిస్తారు. అత్యవసర సందర్భాల్లో గంటల వ్యవధిలోనే దస్త్రాన్ని పరిష్కరిస్తారు. వైద్యం చేయించుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక బాధితుడు తనకైన వైద్య ఖర్చుల బిల్లులను జతచేసి కూడా తగిన సాయాన్ని కోరవచ్చు. రోగం వివరాలు, వైద్య పరీక్షల నివేదికలు, ఖర్చుల వివరాలు అన్నింటిని పరిశీలిస్తారు. సక్రమంగా ఉంటే వైద్యానికయ్యే వ్యయంలో కొంత మొత్తాన్ని రెండు నెలల వ్యవధిలో బాధితుడికి మంజూరు చేస్తారు. కొన్ని సందర్భాల్లో వైద్యచికిత్స పొందుతూ బాధితుడు మరణించినా సరే వైద్యానికైన ఖర్చులో కొంత మొత్తాన్ని ఆ కుటుంబానికి చెల్లిస్తున్నారు.