బాధ్యతారాహిత్యాన్ని  ఉపేక్షించేది లేదు


– ఎన్నిసార్లు చెప్పినా కొందరి అధికారుల్లో మార్పు రావడం లేదు
– పరిస్థితిలో మార్పురాకపోతే స్వయంగా నేనే వచ్చి మకాం వేస్తా
– నిర్లక్ష్యం వహించే అధికారులపై వేటు తప్పదు
– డెంగీ, మలేరియా ప్రబలడంపై సీఎం ఆగ్రహం
– టెలీకాన్ఫరెన్స్‌లో అధికారులను హెచ్చరించిన సీఎం చంద్రబాబు
అమరావతి, సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి) : అధికారులు పనుల్లో బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించేది లేదని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. శనివారం డెంగీ, మలేరియా ప్రబలడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, డిఎంహెచ్‌ వోలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అధికారుల అలసత్వం వల్లనే ఈ పరిస్థితి అంటూ సీఎం మండిపడ్డారు. ఎన్నిసార్లు చెప్పినా కొందరిలో మార్పురావడం లేదని తీవ్రహెచ్చరికలు జారీచేశారు. పారిశుధ్యం, అనారోగ్య పరిస్థితిలో మార్పురాకపోతే స్వయంగా డెంగీ, మలేరియా ప్రాంతాల్లో మకాంవేస్తామని సీఎం తెలిపారు. సోమవారానికి మార్పు రాకపోతే స్పాట్‌ లోనే పనిచెయ్యని అధికారులను సస్పెండ్‌ చేస్తా అని సీఎం హెచ్చరించారు. అసమర్ధతను, నిర్లక్ష్యాన్ని సహించే ప్రసక్తేలేదని, బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల యోగక్షేమాలు విచారించాలని, వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు అందేలా శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. వివరణలు, సంజాయిషీలు కాదు నేను కోరుకునేది.. మన కార్యాచరణ ప్రజల కళ్లకు కనిపించాలన్నారు. డెంగీ, మలేరియా ప్రాంతాలకు మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డైరెక్టర్‌, వైద్యశాఖ సలహాదారు ఎందుకని వెళ్లలేదు? అని ఆయన ప్రశ్నించారు. రాబోయే రెండు వారాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, అన్నిచోట్ల పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సురక్షిత తాగునీటిని అందుబాటులో ఉంచాలని, వైద్య శిబిరాలు నిర్వహించాలని మందులు పంపిణీచేయాలని సూచించారు. మురుగు నిల్వలు ఉండరాదని, ఆయా ప్రాంతాలలో బ్లీచింగ్‌ చల్లాలన్నారు. అలాగే కాచి చల్లార్చిన నీటినే తాగేలా ప్రజలను చైతన్య తేవాలని అధికారులకు సూచించారు.

తాజావార్తలు