బాబాతో అనుబంధం అపురూపమైంది

– మానవసేవే మాదవసేవ అని ప్రపంచానికి చాటిన వ్యక్తి బాబా

– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

– సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం

పుట్టపర్తి, నవంబర్‌23(జ‌నంసాక్షి) : సత్యసాయిబాబాతో తనకున్న అనుబంధం అపురూపమైనదని, మానవసేవే మాదవసేవ అని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి బాబా అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఉదయం అనంతపురం జిల్లాలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి చేరుకున్నారు. ప్రశాంతినిలయంలో నిర్వహిస్తున్న సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. సాయి కుల్వంత్‌ హాల్‌లో బాబా మహా సమాధిని దర్శించుకున్నారు. సత్యసాయి బాబా 99వ జయంతి సందర్భంగా భారీ కేక్‌ను కట్‌ చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు విూడియాతో మాట్లాడుతూ.. సత్యసాయి బాబాతో తనకున్న అనుబంధం అపురూమైనదని చెప్పారు. ‘మానవ సేవే మాధవ సేవ’ అని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి బాబా అని కొనియాడారు. సత్యసాయిబాబా అందించిన మహా ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తి అని, ఇక్కడకు వచ్చే ప్రతి భక్తుడికీ మనశ్శాంతితో పాటు, సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చంద్రబాబు చెప్పారు. బాబా మనందరి మధ్య లేకపోయినా మనందరిలో ఆయన జీవించి ఉన్నారని చంద్రబాబు అన్నారు. ఉన్నత స్థాయికి చేరాలనుకునే ప్రతి వ్యక్తీ బాబా సూక్తులను, మార్గాలను పాటిస్తే తప్పకుండా గమ్యం చేరుకుంటారని చెప్పారు. సత్యసాయి అనుగ్రహంతోనే పుట్టపర్తికి రాగలమని, బాబా పిలుపుతోనే ఇక్కడికి వచ్చానని చంద్రబాబు తెలిపారు. ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ మ¬న్నతమైన అనుభూతిని పొందుతానని, ఈ ప్రదేశాన్ని వదిలి వెళ్లాలనిపించదని, తనకు సమయం దొరికినప్పుడల్లా ఇక్కడకు రావాలనిపిస్తుందని సీఎం చెప్పారు. క్రమశిక్షణలో సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు ప్రపంచ దేశాల్లోని అన్ని సంస్థలకు ఆదర్శంగా నిలిచిందని చంద్రబాబు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట మంత్రులు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, దేవినేని ఉమా, జవహర్‌, శిద్ధారాఘవరావు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌లు పల్లె రఘునాథరెడ్డి, పయ్యావుల కేశవ్‌, జిల్లా నాయకులు పాల్గొన్నారు.