బాబుకు ఓటమి భయం పట్టుకుంది


– వైసీపీ పథకాలు కాపీకొడుతున్నారు
– వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు, జనవరి22(జ‌నంసాక్షి) : ఏపీ సీఎం చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే వైసీపీ పథకాలను కాపీ కొడుతున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ఎన్నికలు వస్తుండటంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శించారు. అప్పట్లో ఇవి సాధ్యం కాదని చెప్పిన టీడీపీ నేతలు ఇప్పుడు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మహిళలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించిని ఆయన, పెన్షన్‌ మొత్తాన్ని కూడా పెంచుతామని చెప్పారన్నారు. ఇది ఎన్నికల వరకు మాత్రమేనని, పాదయాత్రలో జగన్మోహన్‌ రెడ్డి ఇచ్చిన హావిూలను హడావిడిగా టీడీపీ అమలు చేస్తోందని మండిపడ్డారు. ఏదో ఒక విధంగా ఓట్ల కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుకోసం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నించారని.. వైఎస్‌ జగన్‌ని కేటీఆర్‌ కలిస్తే గగ్గోలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు కాకాని గోవర్దన్‌రెడ్డి.. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు.. 40ఏళ్ల వయసున్న జగన్‌మోహన్‌రెడ్డిని కాపీ కొడుతున్నారని సెటైర్లు వేశారు. నాలుగున్నరేళ్ల పాలన సాగించిన చంద్రబాబు, ఏపీ ప్రజలకు చేసిన మేలు ఏవిూ లేదన్నారు. కేవలం జన్మభూమి కమిటీలు, ఇసుక ర్యాంపుల పేరుతో తమ కుటుంబం, పార్టీ నేతల ఆస్తులు పెంచుకున్నారే తప్పా ప్రజల ఆర్థిక ఇబ్బందులు, వారి సమస్యల పరిష్కారంలో ఎటువంటి చొరవ చూపలేదని విమర్శించారు. తాను ఏ పార్టీతో పెట్టుకున్నా నీతి, అది ఏపీ ప్రజలకోసమే అని చంద్రబాబు ఏపీ ప్రజలను దారుణంగా మోసం చేస్తున్నారని విమర్శించారు. కేవలం వ్యక్తిగత స్వార్థం కోసమే చంద్రబాబు ఏపనైనా చేస్తాడని, ఇప్పటికే అనేకసార్లు ఇది రుజువైందన్నారు. ఏపీ ప్రజలు చంద్రబాబు కుటిల రాజకీయాలు గమనిస్తున్నారని తగిన గుణపాఠం తప్పదని గోవర్ధన్‌రెడ్డి హెచ్చరించారు.