బాబును టార్గెట్‌ చేస్తూ..  మోదీ రాక్షసానందం పొందుతున్నారు


– రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు దిగుతున్నారు
– పవన్‌ ఎవరితో పోటీ చేస్తే మాకేంటి?
– టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న
విజయవాడ,జనవరి3(జ‌నంసాక్షి): ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ రాక్షసానందం పొందుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శించారు. గురువారం విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. ప్రధానిగా దేశాన్ని పట్టించుకోవడం మానేసిన మోదీ, రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు దిగుతున్నారని దుయ్యబట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు సహకారంతో పదవులు దక్కించుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పుడు ఆయన్నే విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  దేశాన్ని అభివృద్ధి చేసే విషయాన్ని పక్కన పెట్టిన మోదీ ఇప్పుడు చంద్రబాబును టార్గెట్‌ చేస్తూ, చంద్రబాబును విమర్శించేవారిని అభినందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి పూర్తిస్థాయిలో సహకారం అందనప్పటికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై టీడీపీ ప్రభుత్వం ముందుకు పోతోందని గుర్తుచేశారు. ఏపీలో నాలుగేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో చూసి నేర్చుకోవాలని మోదీకి సూచించారు. తెలంగాణలో మహాకూటమికి 21సీట్లు వచ్చాయనీ, బీజేపీకి కేవలం ఒకే సీటు వచ్చిందని తెలిపారు. బీజేపీకి తెలంగాణలో 109 చోట్ల డిపాజిట్‌ రాలేదనీ, దీనిపై మాట్లాడని మోదీ, టీడీపీని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, బీజేపీ ఏపీ చీఫ్‌ కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ అధినేత జగన్‌ కుమ్మక్కు అయి చంద్రబాబును టార్గెట్‌ చేసుకున్నారని ఆరోపించారు. అసలు పవన్‌ కల్యాణ్‌తో కలుస్తామని చంద్రబాబు చెప్పలేదని బుద్దా అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పోరాటం చేసే సందర్భాల్లో పవన్‌ కలసి వస్తే కాదనేది లేదని చంద్రబాబు చెప్పారని తెలిపారు. జనసేన పార్టీ 175 స్థానాల్లో పోటీచేస్తే మాకేంటి ఇబ్బంది అని ప్రశ్నించారు. ఇక ఓటమి భయంతోనే చంద్రబాబు… జనసేన పొత్తుకోసం చూస్తున్నారని సీపీఐ నేత నారాయణ వ్యాఖ్యానించడం సరికాదన్నారు బుద్దా అన్నారు. మోడీ కళ్లుండి చూడలేని గుడ్డివాడుగా రాష్ట్ర అభివృద్ధిని చూడలేకపోతున్నారని మండిపడ్డారు. విలువలేని నాయకులతో మోడీ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారని.. చంద్రబాబును తిట్టించేందుకు మోడీ టెలికాన్ఫిరెన్స్‌ ఏర్పాటు చేశారని ఆరోపించారు. కేంద్రం ఎటువంటి సహాయం చేయకపోగా చంద్రబాబును తిట్టిస్తు మోడీ పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.