బాబ్రీ విధ్వంసంపై స్తంభించిన లోక్‌సభ

నింధితులను శిక్షించాలని బీఎస్పీ, ఎంఐఎంల డిమాండ్‌
సభలో గందరగోళం .. పలుమార్లు వాయిదా
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) :
లోక్‌సభ గురువారం దద్దరిల్లింది. బాబ్రీ విధ్వంసం అంశంపై స్తంభించింది. ఎలాంటి చర్చ లేకుండా పలుమార్లు వాయిదా పడింది. ఎఫ్‌డీఐలపై రెండ్రోజుల పాటు వాడివేడి చర్చల అనంతరం గురువారం సభలో బాబ్రీ మసీదు కూల్చివేత అంశం కలకలం సృష్టించింది. ఉదయం సభ ప్రారంభం కాగానే బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలని వామపక్షాలతో పాటు బీఎస్పీ, ఎంఐఎం సభను అడ్డుకున్నాయి. బాబ్రీ మసీదు కూల్చివేతకు గురై 20 ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డాయి. మసీదు కూల్చివేసింది తామేనని ప్రకటించిన వారిపై చర్యలు ఎందుకు చేపట్టలేదని నిలదీశాయి. ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీతో పాటు బీఎస్పీ, వామపక్షాల సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. 16వ శతాబ్దానికి చెందిన బాబ్రీ మసీదును కూల్చివేసిన వారిపై ఎందుకు
చర్యలు తీసుకోలేదంటూ ఎంఐఎం, బీఎస్పీ, వామపక్ష సభ్యులు ప్రభుత్వంపై మండిపడ్డారు. దానికి ప్రతిగా బీజేపీ, శివసేన సభ్యులు తమ స్థానాల్లోంచి లేచి వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మించి తీరతామని స్పష్టం చేశారు. ఇరు పక్షాల నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాలు సజావుగా సాగేందుకు సహకరించాలని, ప్రశ్నోత్తరాలు ముగిసిన అనంతరం దీనిపై చర్చకు అనుమతిస్తానని స్పీకర్‌ విూరాకుమార్‌ ప్రకటించారు. అయినా సభ్యులు వెనక్కు తగ్గలేదు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన అనంతరం అదే పరిస్థితి పునరావృతమైంది. సభలో బీఎస్పీ ఎంపీ నల్లజెండాను ప్రదర్శించడంతో కలకలం రేగింది. దీనిపై స్పీకర్‌ విూరాకుమార్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలతో సభ గౌరవానికి భంగం కలిగించకూడదని మందలించారు. మరోవైపు, సదరు సభ్యుడిని సభ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ బీజేపీ, శివసేన సభ్యులు పట్టుబట్టారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్‌ రెండు గంటలకు వాయిదా వేశారు.