బాయిల్డ్ రైస్ కొనబోం
` పార్లమెంటులో తేల్చిచెప్పినకేంద్రం
` ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యే: టీఆర్‌ఎస్
దిల్లీ,మార్చి 30(జనంసాక్షి):ఉప్పుడు బియ్యం సేకరించేది లేదని పార్లమంట్లో కేంద్రం స్పష్టం చేసింది. లోక్‌సభలో కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. అవసరాల రీత్యా రాష్ట్రాలే ఉప్పుడు బియ్యం సేకరించుకోవాలని సూచించారు. ఇకపై ఉప్పుడు బియ్యం సేకరించబోమని గత ఖరీఫ్లోనే చెప్పినట్లు వివరించారు. 2020`21 ఖరీఫ్లో 47.49 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్, 6.33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వివరణ ఇచ్చారు.ఉప్పుడు బియ్యం సేకరించబోమని కేంద్ర మంత్రి రాతపూర్వకంగా వెల్లడిరచడంతో ధాన్యం సేకరణపై మరోసారి అయోమయ స్థితి నెలకొననుంది. ఈ అంశంపై ఇప్పటికే కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. ఒప్పందం మేరకు రాష్ట్రంలో ధాన్యం సేకరిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడిరచిన విషయం తెలిసిందే. తాజాగా మరో కేంద్ర మంత్రి ఉప్పుడు బియ్యం సేకరించేది లేదని వివరణ ఇవ్వడంతో పరిస్థితి ఏంటనేది తేలాల్సి ఉంది. కాగా పార్లమెంటులో కేంద్రం ప్రకటనపై టీఆర్‌ఎస్ నేతలు మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ తెలంగాణ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యేనని స్పష్టం చేశారు. కేంద్రం ధాన్యం కొనాల్సిందేని, లేని పక్షంలో పోరాటం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.