బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు

ఆదిలాబాద్‌, డిసెంబర్‌ 30 (): జిల్లాలో వెట్టిచాకిరిని సమూలంగా రూపుమాపేందుకు అధికారులు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ అశోక్‌ ఆదేశించారు. కూలీలుగా మారుతూ వెట్టిచాకిరి చేస్తున్న 14ఏళ్లలోపు బాలబాలికల వివరాలను సేకరించి, వారితో పనిచేయిస్తున్న యజమానులపై బాల           కార్మిక చట్టం ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఎంతో మంది బాల బాలికలు చదువుకోకుండా, పనులకు వెళ్లుతున్నారని విద్యాహక్కు చట్టం ప్రకారం పిల్లలను 8వ తరగతి వరకు చదివించే బాధ్యతపై తల్లిదండ్రులపై ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. విద్యార్థులను పాఠశాలలకు పంపకుండా పనులకు పంపే తల్లిదండ్రులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడమే కాకుండా, 20వేల రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని హెచ్చరించారు. అధికారుల బృందం పనులకు వెళ్లే బాల బాలికల వివరాలను సేకరించి, ఎంత మంది పనిచేస్తున్నారో ఆ నివేదికను  సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్‌కు పంపించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు.