బాసరలో ప్రారంభమైన చంద్రబాబు పాదయాత్ర
ఆదిలాబాద్, డిసెంబర్ 6 :ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు చేపట్టిన వస్తున్నా మీ కోసం కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర గురువారం ఉదయం బాసరలో ప్రారంభమైంది. చంద్రబాబు బాసర సరస్వతిని సందర్శించుకొని జాతర చేపట్టారు. చంద్రబాబు వచ్చిన సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు. మహిళలు మంగల హారతులతో బాబుకు ఘన స్వాగతం పలికారు. క్షేత్ర స్థాయిలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా చేపట్టిన ఈ పాదయాత్ర మూడు నియోజకవర్గాలలోని 68 గ్రామాల్లో 124 కిలోమీటర్లు కొనసాగుతుంది. గతంలో తెలుగుదేశం పార్టీకి కంచకోటగా ఉన్న ఆదిలాబాద్‌లో జిల్లాలో తెలంగాణ ఉద్యమం కారణంగా కొంత బలహీనపడింది. చంద్రబాబు చేపట్టిన ఈ పాదయాత్ర వల్ల పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి దోహదపడుతుందని నాయకులు భావిస్తున్నారు. బాబు యాత్రలో ఆదిలాబాద్ ఎంపీ రమేష్ రాథోడ్, సుమన్ రాథోడ్, నాగేశ్, రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.