బిందు తుంపర సేద్యానికి ప్రాధాన్యం
పంటల రక్షణకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి
అనంతపురం,జూలై30(జనం సాక్షి): బోరున్న ప్రతి రైతు బిందు, తుంపర సేద్యం పరికరాలను వినియోగించు కోవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమని సూక్ష్మసేద్య పథక సంచాలకులు అన్నారు. జిల్లాలో 35 వేల హెక్టార్లలో డ్రిప్ మంజూరు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. జిల్లాలో హంద్రీనీవా పరివాహక ప్రాంతాల రైతులకు తుంపర సేద్యం పరికరాల పంపిణీలో ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, గుంతకల్లు, రాప్తాడు, ఆత్మకూరు, బెళుగుప్ప, పెనుకొండ మండలాల పరిధిలో హంద్రీనీవా కాలువలో నీరు పారుతోంది. ఆయా ప్రాంతాల రైతులతో తుంపర సేద్యం పరికరాలకు దరఖాస్తులు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అలాగే బిందు, తుంపర సేద్యంతో ఉద్యాన పంటల్లో అత్యధిక దిగుబడులు సాధించిన రైతులను పంచాయతీకొకరు చొప్పున ఎంపిక చేయాలన్నారు. వారందరికీ డ్రిప్‌పై పూర్తిస్థాయిలో శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. శిక్షణ పొందిన రైతులతో గ్రామాల్లోని ఇతర రైతులకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదిలావుంటే పల్లెల్లో సేంద్రియ వ్యవసాయంపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించే దిశగా కార్యక్రమాలు ఉండాలని తెలిపారు. గతంలో డీఆర్‌డీఏ-వెలుగు ప్రాజెక్టులో ఎన్‌పీఎం విభాగం ద్వారా సేంద్రియంపై ప్రత్యేక దృష్టి సారించామని, సత్ఫలితాలు వచ్చాయన్నారు. ప్రస్తుతం ఈ విభాగాన్ని వ్యవసాయ శాఖలోకి విలీనం చేశారని, సేంద్రియ ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఎరువును ఎలా తయారు చేసుకోవాలన్న దానిపై రైతుల్లో పరిపూర్ణ అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. రసాయన ఎరువుల వల్ల రైతులు నష్టపోతారన్నారు. అలాగే భూముల్లోనూ సారవంతం తగ్గుతుందన్నారు. సేంద్రియ ఎరువుల వల్ల దిగుబడి అధికంగా రావడమే కాదు.. భూమి
సారవంతంగా తయారవుతుందన్నారు.
———————————-