బిజెపి కార్యాలయానికి అటల్‌ భౌతిక కాయం తరలింపు

పార్టీ కార్యాలయంలో నివాళి అర్పించిన ప్రధాని మోడీ

బిజెపి అగ్రనేతలు అద్వానీ తదితరులు

భూటాన్‌ రాజు, నేపాల్‌ విదేశాంగ మంత్రి నివాళి

భారీగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ నేతలు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): మాజీప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి భౌతికకాయాన్ని శుక్రవారం ఉదయం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆయన పార్థివదేహనికి పార్టీ అగ్రనేతలు, పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా, ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర మంత్రులు, తదితరులు నివాళులర్పించారు. అనంతరం బీజేపీ అగ్ర నేత లాల్‌ కృష్ణ అద్వానీ, శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ఛత్తీస్‌గఢ్‌ సీఎం రమణ్‌ సింగ్‌ విషణ్ణ వదనాలతో నివాళులర్పించారు. అద్వానీ తన కుమార్తె ప్రతిభ అద్వానీతో సహా వచ్చి, వాజ్‌పేయికి నివాళులర్పించారు. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే తన కుటుంబ సభ్యులతో సహా బీజేపీ కార్యాలయానికి వచ్చి, వాజ్‌పేయికి నివాళులర్పించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్లు పి.సదాశివం, భన్వరీలాల్‌ పురోహిత్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, నేవీ చీఫ్‌ సునీల్‌ లాంబా, ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తదితరులు మాజీ ప్రధానికి నివాళులర్పించారు. డీఎంకే నేత ఏ రాజా, అస్సాం సీఎం శర్వానంద్‌ సోనోవాల్‌, మణిపూర్‌ సీఎం బిరేన్‌ సింగ్‌, కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ తదితరులు వాజ్‌పేయికి శ్రద్దాంజలి ఘటించారు. అటల్‌కు నివాళులర్పించేందుకు భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నంజియెల్‌ వాంగ్‌చుక్‌ శుక్రవారం ఉదయం ఢిల్లీ వచ్చారు. అదేవిధంగా నేపాల్‌ విదేశాంగ మంత్రి ప్రదీప్‌ కుమార్‌ గ్యావలి ఢిల్లీ చేరుకున్నారు.అటల్‌జీని కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రజల సందర్శనార్థం వాజ్‌పేయి భౌతికకాయాన్ని మధ్యాహ్నం వరకు అక్కడ ఉంచనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభం కానుండడంతో వేలాదిగా తరలివచ్చి నివాళి అర్పించారు. వాజ్‌పేయీ మృతి నేపథ్యంలో కేంద్రం ఈ నెల 22 వరకు సంతాప దినాలుగా ప్రకటించింది.’భారత రత్న’ అటల్‌ బిహారీ వాజ్‌పేయి పార్థివ దేహానికి బీజేపీ ప్రధాన కార్యాలయంలో వేలాది మంది అభిమానులతోపాటు వివిధ పార్టీల నేతలు నివాళులర్పించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారని, ఆయన అందరివాడని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. ఢిల్లీలో వాజ్‌పేయి పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం నరసింహన్‌ మాట్లాడారు. మానవతకు ప్రతీక మాజీ ప్రధాని వాజ్‌పేయి అని కొనియాడారు. అటల్‌జీ అజాత శత్రువు, ఆయనకు నిరోధులు లేరు, అంతా ఆప్తులే. ద్వేషం, శత్రుత్వం అన్న పదాలు ఎరుగని మహానీయుడు వాజ్‌పేయి. అటల్‌జీ మన మధ్య లేకున్నా గుండెల్లో ఎప్పుడూ నిలిచే ఉంటారని అన్నారు.