బిజెపి పెట్టే దరఖాస్తులతో 15 లక్షలు పడాలి
ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ సెటైర్లు
హైదరాబాద్,ఆగస్ట్17(జనంసాక్షి): బీజేపీ నేతలు తలపెట్టిన దరఖాస్తుల ఉద్యమంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ హావిూ ఇచ్చిన రూ.15 లక్షల కోసం దరఖాస్తులు ఆహ్వానించడాన్ని స్వాగతిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అర్హులైన తెలంగాణ వాసులంతా బీజేపీ నేతలకు దరఖాస్తులు పంపాలని.. జన్‌ధన్ ఖాతాల్లోకి ధనాధన్ డబ్బులు వస్తాయంటూ సెటైర్ వేశారు. గతంలో ప్రధాని మోడీ నల్లధనం వాపస్ తెస్తానని ఇచ్చిన హావిూపై ఈ రకంగా కెటిఆర్ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ఇదిలావుంటే దళిత బంధుపై మున్సిపల్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ’20వ శతాబ్దంలో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సామాజిక న్యాయం ద్వారా దళితుల అభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తే.. 21వ శతాబ్దంలో సీఎం కేసీఆర్ ఆర్థిక సాధికారత ద్వారా దళితుల అభ్యున్నతికి ప్రయత్నిస్తున్నారు. మరో మార్గదర్శక కార్యక్రమాన్ని మొదలుపెట్టిన సీఎం కేసీఆర్‌కు వందనాలు’అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.