బిసి రిజర్వేషన్ సునామి… బిపి మండల్
నాగార్జునసాగర్ (నందికొండ),ఆగస్టు 25,(జనం సాక్షి); బిసి రిజర్వేషన్ పితామహుడు,బిహార్ మాజి ముఖ్యమంత్రి,మాజీ జాతీయ బిసి కమిషన్ చైర్మన్ బిపి మండల్ కు భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని బిసి యువజన సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి రేపాకుల ఆంజనేయులు యాదవ్ డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ హిల్ కాలనీ బిసి స్కూల్లో బీపీ మండల్ 104వ జయంతి సందర్భంగా నివాళి అర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాణం తర్వాత భారత సామాజిక రాజకీయాలను కదిలించి వేసిన ఘనత బిపి మండల కే దక్కుతుందన్నారు. రాజకీయాల్లో ఉద్యోగ విద్య తదితర రంగాల్లో ప్రాతినిధ్యం లేని సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం కోసం మండల్ సాగించిన కృషికి చారిత్రక ప్రాధాన్యం ఉందన్నారు.బీసీ సమాజానికి బీపీ మండల్ తన జీవితాన్ని ధారపోసారని కొనియాడారు.నేడు బీసీలు అన్ని రంగాలలో ఉపయోగించుకుంటున్న రిజర్వేషన్లు బిపి మండల్ చలవేనని, బిసి సమాజం ఆయనకు రుణపడి ఉందని తెలియజేశారు. దేశంలోని జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఎంతో కృషి చేశారన్నారు.మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని విమర్శించారు.మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ మండల్ విగ్రహాలను పార్లమెంట్, అసెంబ్లీలలో ప్రతిష్టించాలని ఆయన డిమాండ్ చేశారు.బిసి కార్పొరేషన్ ద్వారా బీసీలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ నాయకులు శ్రీనివాసచారి, మోర మధు యాదవ్,గణపురం శంకర్,దేవబోయిన కొండల్,బిసి స్కూల్ ప్రిన్సిపల్ రజనీకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



