బీజేపీకి ఓటేస్తే.. ఉచిత విద్యుత్‌కు మంగళం పాడుకున్నట్టే.. ` మంత్రి జగదీశ్‌రెడ్డి


నల్గొండ(జనంసాక్షి): బీజేపీకి ఓటు వేయడం అంటే మనకు మనమే వ్యవసాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందిస్తున్న ఉచిత విద్యుత్‌కు మంగళం పాడుకోవడమే నని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి అన్నారు. అంతటితో ఆగకుండా కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా రూపొందించిన విద్యుత్‌ సంస్కరణలు, వ్యవసాయ చట్టాలు అమలులోకి వస్తాయని మంత్రి హెచ్చరించారు. మునుగోడు నియోజకవర్గ పరిధిలోని గట్టుప్పుల్‌ మండల కేంద్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఆదివారం మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.ప్రభుత్వ చీప్‌ విప్‌ గంప గోవర్ధన్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు ఆగయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి నేతలు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాకా పెరిగిన వంట గ్యాస్‌ ధర ఎన్నిసార్లు పెరిగిందోనన్నది ఆ బరువును మోస్తున్న సామాన్య మధ్యతరగతి గృహిణులకు తెలిసిందేనన్నారు. దానికి తోడు గ్యాస్‌ విూద సబ్సిడీ ఎత్తివేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కిందని విమర్శించారు. అలాంటి గ్యాస్‌ సామాన్యులకు గుదిబండగా మారక ముందే మనం మేలుకొని బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అంతటితో ఆగని మోదీ సర్కార్‌ పెంచిన డీజిల్‌, పెట్రోల్‌ ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు మునుగోడు ఉప ఎన్నికలు ఒక ఆయుధంలాంటివన్నారు.ఆ ఆయుధం తో ఈ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెబితే ఢల్లీి బాద్‌షాలకు మైండ్‌ బ్లాక్‌ కావాలన్నారు. కార్పొరేట్‌ శక్తుల కోసం రూపొందించిన విద్యుత్‌ సంస్కరణలు, వ్యవసాయ చట్టాలు అమలులోకి తెచ్చి సామాన్యుడి నడ్డి విరిచేందుకు ప్రణాళికలు రూపొందించారని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించాలని, అప్పుడే అన్ని సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. ఛత్తీస్‌గఢ్‌, బిహార్‌, ఢల్లీి అంటూ బీజేపీతో కాంట్రాక్టులకు ఒప్పందం చేసుకొని ఆ పార్టీలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరాడని, ప్రజల సమస్యలు కాకుండా.. వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చినందునే మునుగోడులో సమస్యలు పేరుకుపోయాయని విమర్శించారు.

తాజావార్తలు