బీజేపీకి గుడ్‌బై చెప్పిన

మాజీ ఎంపీ చందన్‌మిత్రా
– మోదీ వెళ్లొచ్చిన కొద్ది గంటలకే రాజీనామా
– తృణముల్‌ కాంగ్రెస్‌లో చేరే అవకాశం
కోల్‌కతా, జులై18(జ‌నం సాక్షి) : భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి మరో షాక్‌ తగిలింది. సీనియర్‌ జర్నలిస్టు, రాజ్యసభ మాజీ ఎంపీ చందన్‌ మిత్రా బీజేపీకి గుడ్‌బై చెప్పారు. త్వరలోనే పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పశ్చిమ బెంగాల్‌ వెళ్లి వచ్చిన కొద్ది గంటల్లోనే మిత్రా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మంగళవారమే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు తన రాజీనామా లేఖ పంపినట్టు సమాచారం. ఈ నెల 21 ఆయన టీఎంసీలో చేరనున్నారు. ప్రతియేటా జూలై 21న టీఎంసీ ‘షాహిద్‌ దివస్‌’ (అమరవీరుల దినోత్సవం)గా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ రోజు జరిగే భారీ ర్యాలీ సందర్భంగా సీఎం మమత నేతృత్వంలో మిత్రా టీఎంసీలో చేరనున్నట్టు సమాచారం. మోదీ-షా నాయకత్వంలో తనను పక్కన బెట్టడంపై మిత్రా కలత చెందినట్టు చెబుతున్నారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్‌.కే. అడ్వాణీకి అత్యంత సన్నిహితుడిగా మిత్రాకి పేరుంది. ‘పయనీర్‌’ దినపత్రిక సంపాదకుడైన ఆయన.. 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగా నామినేట్‌ అయ్యారు. తిరిగి 2010 జూన్‌లో మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. బీజేపీ తాజా విధానాలపై బహిరంగంగానే అసమ్మతి వ్యక్తం చేస్తున్న ఆయన… సోషల్‌ విూడియాలో పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నారు.