బీజేపీని తరమండి.. దేశాన్ని రక్షించండి..

– ఆగస్టు 15 నుంచి ఈ నినాదంతోనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తాం
– పందిరి సరిగా వేయలేనివారు దేశాన్ని నిర్మిస్తారా?
– 2019లో ఒంటిరిగానే పోటీ చేస్తాం
– పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
కోల్‌కతా, జులై21(జ‌నం సాక్షి) : బీజేపీని తరమండి దేశాన్ని రక్షించండి అంటూతృణమూల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు, బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ అన్నారు. బీజేపీపై శనివారం ఆమె విమర్శల దాడి చేశారు. కోల్‌కతాలో పార్టీ వార్షికోత్సవాల సందర్భంగా మెగా ర్యాలీలో పాల్గొని ఆమె ప్రసంగించారు. ఆగస్టు 15నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బీజేపీని తరమండి.. దేశాన్ని రక్షించండి అనే నినాదంతో ప్రచారం చేస్తామని ఆమె పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో సంచలనం జరగబోతుందన్న ఆమె.. దేశానికి బెంగాల్‌ దారి చూపిస్తుందని తెలిపారు. 2019 ఎన్నికల్లో బీజేపీ గట్టి దెబ్బ తగులుతుందని జోస్యం చెప్పిన మమత.. ఆ పార్టీ 100 సీట్లకు మించి గెలుపొందలేదన్నారు. బెంగాల్లో బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్‌, సీపీఐ సాయం అక్కర్లేదని తేల్చి చెప్పిన మమత.. ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 42 స్థానాల్లో తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ (ఎం)తో రాజకీయ పోరాటాన్ని కొనసాగిస్తామని, బీజేపీని తరిమికొట్టి దేశాన్ని గెలిచేందుకు ప్రతిన బూనుదాం’ అని మమత ఉద్వేగంగా ప్రసంగించారు. దేశమంతటా మూకుమ్మడి దాడులు జరుగుతున్నాయని, ప్రభుత్వమే మనలో కొందర్ని తాలిబన్లగా తయారు చేస్తోందన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లలో నేను గౌరవించే మంచి వ్యక్తులు కొందరు ఉన్నారు. కానీ మిగతా వాళ్లంతా నీచ రాజకీయాలు చేస్తున్నార’ని మమత మండి పడ్డారు. ఇటీవలే మిడ్నాపూర్‌లో నిర్వహించబడిన మోదీ బహిరంగ సభలో టెంటు కుప్పకూలిన విషయాన్ని మమతా బెనర్జీ ప్రస్తావిస్తూ.. పందిరి చక్కగా వేయలేని వారు.. దేశాన్ని ఎలా రక్షిస్తారు అని ఎద్దెవా చేశారు. టెంట్‌ కుప్పకూలిన ఘటనలో 90 మంది గాయపడిన విషయం విదితమే.
తృణముల్‌ కాంగ్రెస్‌లో చందన్‌ మిత్రా చేరిక..
పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి ఎదురుదెబ్బ తగిలింది. బెంగాల్‌లో పట్టునిలుపుకోవాలని భావిస్తున్న ఆ పార్టీకి పెద్ద షాకే. ‘పయనీర్‌’ దినపత్రిక ఎడిటర్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌, బీజేపీ మాజీ ఎంపీ చందన్‌ మిత్రా శనివారం బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ)లో చేరారు. జులై 17న ఆయన తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు పంపారు. కోల్‌కతాలో టీఎంసీ ప్రతిఏటా జులై21న నిర్వహించే అమరవీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మమతా నేతృత్వంలో తృణమూల్‌ పార్టీలో ఆయన చేరారు. నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమర్‌ ముఖర్జీ, అబు తాహీర్‌, సబినా యాస్మిన్‌, అక్రుజ్‌మన్‌లు
టీఎంసీలో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు మమతా బెనర్జీ. బీజేపీ విధి విధానాలు నచ్చక ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు చందన్‌ మిత్ర. ప్రధాని మోదీ, అమిత్‌ షా ప్రవర్తనతో పార్టీలో సంతోషంగా ఉండలేకపోతున్నానని చందన్‌ ప్రకటించారు.  పాటు మరికొంతమంది ఇతర పార్టీ నేతలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మిత్రా కొద్దిరోజులుగా బీజేపీ ప్రభుత్వ విధానాలపై బహిరంగంగానే విమర్శలు చేస్తూ వచ్చారు. బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీకి మిత్రా అత్యంత సన్నిహితుడు. పార్టీలో మోదీ-షా ఆధిపత్యం కొనసాగుతుండటంతో వీరిద్దరి మధ్య దూరం పెరిగింది. 2003-09 మధ్య తొలిసారి రాజ్యసభ సభ్యుడిగా నామినేట్‌ అయ్యారు. తిరిగి 2010 జూన్‌లో మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో హుగ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసిన చందన్‌ మిత్ర.. డిపాజిట్లు కోల్పోయారు. జర్నలిస్టుగా కేరీర్‌ ప్రారంభించిన చందన్‌ మిత్ర.. ఢిల్లీ నుంచి వెలువడుతున్న పాయినీర్‌ న్యూస్‌ పేపర్‌కు ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.