బీజేపీని విమర్శించే హక్కు ముత్తిరెడ్డికి లేదు
ఎమ్మెల్యే బెదిరింపులతోనే రోడ్డు పనులు ఆగాయి
– బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 01 : జనగామ నుండి సిద్దిపేట వరకు 47 కిలోమీటర్ల జాతీయ రహదారికి సంబంధించిన రోడ్డు గురించి బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డి చేసిన ఆరోపణలు బిజెపి తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ గౌడ్ అన్నారు. గురువారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి నితిన్ ఘట్కరీ జనగామ నుంచి సిద్దిపేట వరకు వెళ్లే నేషనల్ హైవేను 388 కోట్లతో నిధులు కేటాయించి టెండర్లను కూడా పిలవడం జరిగిందని, టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లను ముత్తిరెడ్డి యదగిరి రెడ్డి బెదిరించి మీరు ఇక్కడ పనులు చేయాలంటే నాకు రావలసిన పర్సంటేజ్ ఇచ్చిన తర్వాతనే పనులు మొదలు పెట్టాలని కాంట్రాక్టర్లను బెదిరించారని ఆరోపించారు. సిగ్గు లేకుండా రోడ్డు నిర్మాణం జరుగుతలేదని ధర్నా చేయడం ముత్తిరెడ్డికె చెల్లుతుందని ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీని విమర్శించే నైతిక హక్కు ముత్తిరెడ్డి యదిరెడ్డికిలేదని, జనగామ నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఈ నియోజకవర్గానికి ఏమి చేసినావో ఇక్కడి ప్రజలందరికీ తెలుసన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విమర్శించే స్థాయి వారికి లేదన్నారు. జనగామ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 14 ,15 ఫైనాన్స్ కింద వచ్చే నిధులతోటే గ్రామాలో అభివృద్ధి జరుగుతుంది మీ కెసిఆర్ ఒక్క రూపాయి కూడా ఈ గ్రామాలకు పంపిన దాఖలాలు లేవని, కేంద్ర ప్రభుత్వ నిధులనె దారి మళ్లించిన ఘనత కెసిఆర్ దన్నారు. ఈ నియోజకవర్గం నుంచి ముత్తిరెడ్డి యాదిరెడ్డిని తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. వారు కబ్జా చేసిన భూ బాగోతాలను జనగామ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలుసని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని బీజేపీ పార్టీని విమర్శించడం పక్కన పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చేర్యాల పట్టణ అధ్యక్షులు కాటం సురేందర్, చేర్యాల మండల అధ్యక్షులు కాశెట్టి పాండు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు ఉట్లపల్లి సురేష్, కాల్వ మహేశ్ తదితరులు పాల్గొన్నారు.