బీజేపీ, కాంగ్రెస్‌ పాలనకు పెద్దతేడాలేదు


– ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ జాయింట్‌గా దేశంలో పాలన సాగిస్తున్నారు
– బీజేపీకి 80శాతం విరాళాలు పెరిగాయి
– జీఎస్టీ వల్ల పేదల జీవితాలు చిన్నాభిన్నం అయ్యాయి
– సీపీఎం జాతీయ నేత బృందాకారత్‌
విజయవాడ, సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి) : దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల పాలనకు పెద్దతేడా లేదని, ఈ రెండు పార్టీల పాలనలో పేదలకు కష్టాలు, పెద్దలకు లాభాలు తప్ప మరొకటి లేదని సీపీఎం జాతీయ నేత
బృందాకారత్‌ అన్నారు. విజయవాడలో ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ… రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వారి వివరాలు సీక్రెట్‌గా ఉంచటం ఈ దేశంలో మాత్రమే ఉందన్నారు. భారతీయ జనతా పార్టీకి 82శాతం విరాళాలు పెరిగాయని ఆరోపించారు. పారిశ్రామికవేత్తల నుంచి విరాళాలు క్విడ్‌ ప్రోకో కిందకు వస్తుందని, బీజేపీ పాలన, కాంగ్రెస్‌ పాలనకు మధ్య పెద్ద తేడాలే ఏవిూలేవన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ జాయింట్‌ వెంచరే కేంద్రంలో ప్రభుత్వం నడుపుతోందని బృందాకారత్‌ విమర్శించారు. జీఎస్టీ వల్ల సామాన్య, మధ్య తరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడటంతో పాటు అన్ని వస్తువుల ధరలు పెరిగాయని ఆమె మండిపడ్డారు. బడా బాబులకి మాత్రమే జీఎస్టీ వరంగా మారిందని అన్నారు. నోట్లరద్దుతో ఆర్థిక రంగం చిన్నాభిన్నం అవ్వటమే కాకుండా లక్షల మంది అసంఘటిత రంగ ఉద్యోగులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లధనం తెల్లగా మారిందే తప్ప నోట్ల రద్దుతో ప్రయోజనం ఏవిూ దేశానికే చేకూరలేదని బృందాకారత్‌ తెలిపారు. సీపీఎం నేతల… సామాజిక మార్పు లెఫ్ట్‌ పార్టీలతోనే సాధ్యమని, కానీ, మోడీ, అమిత్‌ షా ప్రధాన టార్గెట్‌ లెఫ్ట్‌ పార్టీలే అన్నారు. రాజీలేని పోరాటాన్ని బీజేపీపై మేం చేస్తున్నామని, డబ్బుతో అధికారంలోకి ఎలాగైనా రావాలనేది బీజేపీ వైఖరి అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి బీజేపీకి పట్టంగట్టేందుకు ప్రజలు సిద్ధంగా లేరని ఓటమి తప్పదని హెచ్చరించారు.

తాజావార్తలు