బీజేపీ రాజ్యాంగ సంస్థలను.. నిర్వీర్యం చేస్తుంది


– దేశ అవసరాల కోసం ఏ పార్టీతోనైనా కలుస్తాం
– ఏపీలో అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం
– ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి
గుంటూరు, నవంబర్‌21(జ‌నంసాక్షి) : బీజేపీ రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుందని ఏపీపీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి విమర్శించారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తుంటే జగన్‌, పవన్‌ మాట్లాడ్డం లేదని మండిపడ్డారు. మోదీతో లాలూచీ పడ్డారా?..భయమా? అంటూ రఘువీరా ప్రశ్నించారు. మట్టి, నీళ్లు ఇచ్చి చేతులు దులుపుకున్నవారిని జగన్‌, పవన్‌ ఏవిూ ప్రశ్నించడంలేదని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఏపీకి ఎన్డీఏ ద్రోహం చేసి గొంతు కోసిందన్నారు. టీడీపీ ఆలస్యంగా మేల్కొందని, మిగిలిన పార్టీలు ఎందుకు ఆలోచిస్తున్నాయని రఘువీరా ప్రశ్నించారు. ¬దా ఇవ్వకుంటే రాష్ట్రంలో అడుగుపెట్టనని రాహుల్‌ హావిూ ఇచ్చారని, కేంద్రంలో వచ్చే ప్రభుత్వాన్ని భట్టే ఏపీ భవిష్యత్‌ ఆధారపడి ఉందని ఆయన అన్నారు. దేశ అవసరాల కోసం ఏ పార్టీతోనైనా కలిసి పని చేస్తామని రఘువీరా స్పష్టం చేశారు. వంద స్థానాల్లో బలంగా ఉన్నామని, అన్ని స్థానాల్లో పోటీకి కాంగ్రెస్‌ సిద్ధమని అన్నారు. ఏపీలో పొత్తులపై ఏ పార్టీతో చర్చ జరగలేదని రఘువీరా స్పష్టం చేశారు.  తెలంగాణాలో జగన్‌, పవన్‌ దుకాణాలు మూసేశారని ఎద్దేవా చేశారు. ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే అది సాధ్యమవుతుందని ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని రఘువీరా ధీమా వ్యక్తం చేశారు.