బీజేపీ, వైసీపీలు.. కులాల మధ్య చిచ్చుపెడుతున్నాయి

 

– ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలి

– అగ్రకులాల్లో కాపులే సగానికిపైగా ఉన్నారు

– అందుకే కాపులకు 5శాతం రిజర్వేషన్లు ఇచ్చాం

– కాపులకు రిజర్వేషన్‌ ఇస్తామని వైఎస్‌ మోసం చేశారు

– చిప్‌ టెక్నాలజీ తెలిసివారెవరైనా ఈవీఎంలు ట్యాంపర్‌ చేయొచ్చు

– అన్ని నియోజకవర్గాల్లో వీవీప్యాట్‌ రసీదులను100శాతం ఏర్పాటు చేయాలి

– దావోస్‌లో లోకేష్‌ బృందం సత్ఫలితాలు సాధిస్తోంది

– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి, జనవరి23(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ లో కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష వైసీపీ, బీజేపీ యత్నిస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల కుట్రను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అమరావతిలో బుధవారం టీడీపీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. అగ్రకులాల్లో కాపులు సగానికిపైగా ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అగ్రకులాల్లో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల శాతమే అధికమని పేర్కొన్నారు. అగ్రవర్ణాల రిజర్వేషన్లలో కాపులకు 5శాతం ఇచ్చామని ఏపీ సీఎం చెప్పారు. ఈ విషయంలో బీజేపీ, వైసీపీలు వక్రీకరణలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఢిల్లీకి వెళ్లి కాపుల రిజర్వేషన్‌ పై అడగలేని అసమర్థులు, కాపులకు మేలు చేసిన టీడీపీని నిందిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులకు రిజర్వేషన్‌ ఇస్తామని వైఎస్‌ మోసం చేశారని ఆరోపించారు. కాపు రిజర్వేషన్‌ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి పంపితే బీజేపీ, వైసీపీలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీజేపీ హయాంలో సంస్కరణల వేగం తగ్గిందన్న ఆందోళన అన్నివర్గాల్లో ఉందని ఏపీ సీఎం వ్యాఖ్యానించారు.

ఎలక్టాన్రిక్‌ ఓటింగ్‌ యంత్రాలకు(ఈవీఎం) బదులుగా బ్యాలెట్‌ పేపర్లు తీసుకురావాలని చాలామంది డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు. ఒకవేళ కుదరకుంటే వీవీప్యాట్‌ రసీదులను అన్ని నియోజకవర్గాల్లో 100 శాతం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. దావోస్‌ లో లోకేశ్‌ టీమ్‌ అద్భుతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు. పలు సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. డెలాయిట్‌, విప్రో, ఎజైల్‌, స్విస్‌ రే అనే కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకు వచ్చాయన్నారు. 13 జిల్లాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని చెప్పారు. రైతులకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. కౌలు రైతులకు రూ.5వేల కోట్ల పంటరుణాలు ఇచ్చామని, అలాగే ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.4 వేల కోట్లు ఇచ్చామని చెప్పారు. నాలుగేళ్లలో 97 శాతం రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్నారు. విపత్తు సహాయం 50? నుంచి 75శాతానికి పెంచామని చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రిమండలి నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు ఆయన సూచించారు. పేదల సంక్షేమానికి తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలన్నారు. మంత్రిమండలి నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు చంద్రబాబు సూచించారు. పేదల సంక్షేమానికి తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించాలన్నారు. ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను తొలగింపుతో ఎంతో ఊరట లభించిందని చంద్రబాబు అన్నారు. అవినీతిని 85శాతం నియంత్రించామని ప్రధాని మోదీ చెప్పడం

హాస్యాస్పదమని చంద్రబాబు అన్నారు. రాఫెల్‌, బ్యాంకుల చీటింగ్‌ కుంభకోణాలు అవినీతి నియంత్రణా? అని ప్రశ్నించారు. కోల్‌కతా ర్యాలీ ప్రకంపనల నుంచి బీజేపీ ఇంకా తేరుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, చర్చను పక్కదారి పట్టించాలని బీజేపీ చూస్తోందన్నారు. మళ్లీ బ్యాలెట్‌ పేపర్‌ కావాలనేది అందరి డిమాండ్‌ అని చంద్రబాబు అన్నారు.