బీజేపీ వ్యతిరేక ఓట్లను.. చీల్చేందుకు కుట్ర 

– బీజేపీ అజెండాను అమలు చేసేందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ డ్రామా
– నిన్నటి భేటీతో టీఆర్‌ఎస్‌, వైసీపీ ముసుగు వీడింది
– అవినీతి గొంగలి పురుగును కేసీఆర్‌ కౌగిలించుకున్నారు
– టీఆర్‌ఎస్‌ నేతల ఏపీ పర్యటనల్లో టీడీపీ నేతలు పాల్గొనద్దు
– బీజేపీ, టీఆర్‌ఎస్‌, వైసీపీ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
– టీడీపీపై షర్మిల ఫిర్యాదు చేయడం దురదృష్టకరం
– సోషల్‌ విూడియాలో అసభ్యప్రచారం చేస్తే ఎవ్వరిని వదిలిపెట్టం
– టీడీపీ నేతల టెలీకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి,జనవరి17(జ‌నంసాక్షి): ఏపీలో బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుందని, ఏపీలో బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు జగన్‌, కేసీఆర్‌లు మోడీ ఆదేశాలతో కుట్రలు పన్నుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం ఎలక్షన్‌ మిషన్‌ 2019పై టీడీపీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. బీజేపీ అజెండా అమలు చేసేందుకే ఫెడరల్‌ ఫ్రంట్‌ ను కేసీఆర్‌ తెరపైకి తెచ్చారని విమర్శించారు. కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌కు స్పందన లేదని.. అందుకే హడావుడిగా బుధవారం జగన్‌తో కేటీఆర్‌ సమావేశమయ్యారని అన్నారు. ఇరు పార్టీ నేతల భేటీతో టీఆర్‌ఎస్‌, వైసీపీ ముసుగు తొలగిపోయిందని అన్నారు. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చాలని కుట్ర జరుగుతుందని బాబు చెప్పుకొచ్చారు. బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కాకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రజావ్యతిరేక చర్యలపై ప్రజల్లో తీవ్ర అసహనం ఉందన్నారు. అసహనం కప్పెట్టేందుకే కుట్రలకు తెరదీశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీకి ¬దా ఇస్తే తమకూ ఇవ్వాలని కేసీఆర్‌ అన్నారని గుర్తుచేశారు. షెడ్యూల్‌ 9, షెడ్యూల్‌ 10 సంస్థల విభజనకు అడ్డంకులు పెట్టారన్నారు. చివరికి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయనివ్వలేదని చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశంలో పార్టీలను గందరగోళపరచడం, ప్రజల్లో అయోమయం పెంచడం వీరి లక్ష్యమని బాబు అభిప్రాయపడ్డారు. ఆంధప్రదేశ్‌ అంటే నరేంద్రమోదీకి అసూయ అని చంద్రబాబు అన్నారు. గుజరాత్‌కన్నా ఏపీ మించిపోతుందనే భయమని, ఏపీ అభివృద్ధి చెందకూడదని కేసీఆర్‌ పంతమన్నారు. తన చేతగాని తనం భయటపడుతుందని కేసీఆర్‌కు భయమన్నారు. తన కేసుల్లో జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్‌కు భయ పట్టుకుందని ఫలితంగా మూడు పార్టీలకు చెందిన అసూయపరులంతా ఏకమయ్యారని చంద్రబాబు విమర్శించారు. అక్కసుతోనే భాజపా, వైకాపా, తెరాస కుట్రలు చేస్తున్నాయన్నారు. ఒకే చోటుకు చేరి ఏపీపై కుట్రలు పన్నుతున్నారు. గద్దల మాదిరిగా ఏపీపై వాలి కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. మతాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని అన్నారు. తెలంగాణలో సెంటిమెంట్‌ రెచ్చగొట్టారని, ఇప్పుడు ఏపీలో కులాల మధ్య చిచ్చు రగిలిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా తెగిస్తారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు కోరారు.
షర్మిల తెదేపాపై ఫిర్యాదు చేయడం దురదృష్టకరం..
తెదేపాపై షర్మిల ఫిర్యాదు చేయడం దురదృష్టకరమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సామాజిక మధ్యమాన్ని దుర్వినియోగం చేసింది వైకాపానేని, సోషల్‌ విూడియాలో అసభ్య ప్రచారం చేసింది ఆ పార్టీనే
అని అన్నారు. సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణపై మొదట్లోనే వైకాపా దుష్పచ్రారం చేసిందని, జగన్‌పై విచారణ సాగకుండా చేయాలని కుట్రలు చేశారని, దర్యాప్తు అధికారులను ఇబ్బందులకు గురి చేశారన్నారు. చివరికి న్యాయమూర్తులపై కూడా దుష్పచ్రారానికి తెగబడ్డారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌ కల్యాణ్‌ పెళ్లిళ్లపై అసభ్యంగా ప్రచారం చేశారని, తెదేపా మహిళా నేతలపై అసభ్యంగా మాట్లాడారని, నా కుటుంబ సభ్యులపై కూడా దుష్పచ్రారం చేశారని మండిపడ్డారు. సోషల్‌ విూడియాను దిర్వినియోగం చేస్తే సహించేది లేదని, పార్టీలకు అతీతంగా కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు.
తెరాస నేతల పర్యటనల్లో పార్టీ నేతలు పాల్గొనొద్దు..
ఏపీ పర్యటనలో తెరాస నేత తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు అగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల్లో మొక్కులకు వచ్చి రాజకీయ వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నించారు. తెరాస నేతల ఏపీ పర్యటనల్లో తెదేపా నేతలు పాల్గొనవద్దని సూచించారు. ఎవరైనా పాల్గొంటే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. బంధుత్వాలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలని, స్నేహాలు ఉంటే వ్యక్తిగతంగా చూసుకోవాలని, బంధుత్వాలు, స్నేహాల పేరుతో పార్టీని పణంగా పెట్టరాదని, రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీయవద్దని చంద్రబాబు సూచించారు. ప్రజాప్రయోజనాలను దెబ్బతీసే చర్యలను సహించనని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలంగాణలో 26కులాలను బీసీ జాబితా నుంచి తొలగించారని, ఇక్కడకొచ్చి అదే బీసీలపై కపటప్రేమ చూపుతున్నారని విమర్శించారు. 26 కులాలకు అన్యాయం చేసిన వారితో జగన్‌ అంటకాగుతున్నారన్నారు. తెరాసతో జట్టుకట్టిన వైకాపాకు 26కులాల బీసీలే బుద్ధి చెప్పాలన్నారు. అవినీతి గొంగళి పురుగును కేసీఆర్‌ కౌగిలించుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అవినీతి గొంగళిపురుగుతో స్నేహం తెలంగాణ కోసమేనా? ప్రజలకు కేసీఆర్‌, కేటీఆర్‌ జవాబు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. మోడీ, కేసీఆర్‌, జగన్‌ల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వీరి కుట్రలకు తగిన రీతిలో సమాధానం చెబుతారన్నారు. ఏపీ ప్రజలను తిట్టిన కేసీఆర్‌.. మళ్లీ ఏపీ ప్రజలకు న్యాయం చేసేది నేనే అంటూ అనడం విడ్డూరంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రతీరోజూ పార్టీ నేతలతో చర్చిస్తా..
మరో మూడునెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతీ రోజూ పార్టీల నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడతానని చంద్రబాబు అన్నారు. రోజుకు ఒక అరగంట చొప్పున జిల్లాల వారీగా సవిూక్షిస్తానని తెలిపారు. పార్టీకి సంబంధించిన సంస్థాగత పరిస్థితులపై చర్చిస్తానని అన్నారు. అభ్యర్థిత్వాల విషయాల్లోనూ ప్రత్యేకంగా నిర్మొహమాటంగా మాట్లాడతానని చంద్రబాబు నేతలకు సూచించారు. ఈ మూడు నెలలు నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం చేపట్టిన పథకాలను ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని, ప్రచారంలో చేయడంలో నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలతో మంచిగా మెలగాలని అలాకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడతానంటే కలవదని, ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తించే వారిపైనా చర్యలు తప్పవని చంద్రబాబు అన్నారు. ప్రతీ రోజూ టెలీకాన్ఫరెన్స్‌లో ఎమ్మెల్యేల, టీడీపీ నేతలందరూ పాల్గొనాలని చంద్రబాబు సూచించారు.