బీసీసీఐకి సుప్రీంకోర్టు ఝలక్
న్యూఢిల్లీ: లోధా కమిటీ సూచించిన ప్రతిపాదనల్ని కచ్చితంగా అమలు చేయాల్సిందేనంటూ మరోసారి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)కి సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వీటి అమలుకు రెండు వారాలు తుది గడువునిస్తూ సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. లోధా కమిటీ ప్రతిపాదనలపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. ఈ మేరకు లోధా కమిటీ ప్రతిపాదనలకు అంగీకారం తెలిపేవరకూ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ నిధులు జారీ చేయకూడదని బీసీసీఐకి సూచించింది. ఆ క్రమంలోనే లోధా ప్యానల్ ప్రతిపాదనలను అమలు చేస్తామంటూ రాష్ట్ర సంఘాలు అఫిడవిట్ను దాఖలు చేయాలంటూ ఆదేశించింది. దానిలో భాగంగా బీసీసీఐ అకౌంట్లను పరిశీలించేందుకు లోధా కమిటీ స్వతంత్ర ఆడిటర్ను నియమించుకునేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది.