బీసీ రిజర్వేషన్ల సాధనకు నేడు రాష్ట్ర బంద్
` సంఫీుభావంగా అఖిలపక్ష, బీసీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
` హాజరైన మందకృష్ణ, కోదండరాం
` బీసీ సంఘాలకు అన్ని పార్టీల మద్దతు
` బీజేపీ లక్ష్యంగా కాంగ్రెస్ విమర్శలు
హైదరాబాద్(జనంసాక్షి):బీసీ రిజర్వేషన్ల పరిరక్షణే ధ్యేయంగా ఈనెల 18న తెలంగాణ బంద్‌కు బీసీ సంఘాల ఐకాస పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో బంద్‌కు మద్దతుగా అఖిలపక్ష, బీసీ సంఘాలు హైదరాబాద్‌లో ముందస్తు సంఫీుభావ ర్యాలీ నిర్వహించాయి. బషీరాబాగ్ కూడలి నుంచి ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. బీసీ ఐకాస చైర్మన్ ఆర్.కృష్ణయ్య, తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షుడు కోదండరాం, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీసీ ఐకాస వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. జనాభాలో సగభాగానికి పైన ఉన్న బీసీలకు తప్పకుండా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. శనివారం జరిగే తెలంగాణ బంద్‌లో పార్టీలు, సంఘాలకు అతీతంగా శ్రేణులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
బంద్ ఫర్ జస్టిస్ పేరుతో నేడు బీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిచ్చాయి. బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బీసీ సంఘాలు ఆందోళన నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో బీసీల బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతిస్తోంది. కాంగ్రెస్, బిజెపి, బిఆర్‌ఎస్, లెఫ్ పార్టీలు కూడా బంద్‌కు మద్దతు ఇచ్చాయి. బంద్‌ను విజయవంతం చేయడం ద్వారా ఆవేదనను తెలియచేయాలని ఆర్ .కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఇప్పటికే అన్ని పార్టీలను నేరుగా కలిసి కోరారు. బిసి బంద్‌కు అందరి మద్దతు ఉందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ బిల్లును అడ్డుకునే వాళ్లు కూడా ఈ బంద్‌లో పాల్గొంటున్నారని చెప్పుకొచ్చారు. శుక్రవారం మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తాను కూడా బంద్‌లో పాల్గొంటానని ఉద్ఘాటించారు. ఈ బంద్‌లో కాంగ్రెస్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొంటారని తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పేటెంట్ హక్కు అని ఉద్ఘాటించారు. తాము అధికారంలో ఉన్నప్పటికీ ఉన్నతంగా ఆలోచించి ఈ బంద్‌లో పాల్గొంటున్నామని వివరించారు. బీజేపీ నేతలు ఎన్ని మాటలు చెప్పినా బీసీల హృదయాల్లో చోటు సంపాదించుకోలేరని విమర్శించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఈ బంద్‌లో పాల్గొనాలని మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. బీసీల బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతిస్తోందని ఆ పార్టీ భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రేపటి బీసీ బంద్‌ని జయప్రదం చేయాలని సూచించారు. రేపటి బీసీ బంద్‌కి అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి బీసీలకు న్యాయం చేయాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఉందని ఉద్ఘాటించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా దేశంలో జనగణనలో భాగంగా కులగణన జరగాలని కోరారని పేర్కొన్నారు కాంగ్రెస్ డెడికేషన్ కమిషన్ పెట్టి శాస్త్రీయ పద్ధతిలో కులగణన చేసిందని గుర్తుచేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్పీ వేశామని తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలని ఆర్. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ కలిసి బీసీ బంద్‌కి మద్దతు కోరారని గుర్తుచేశారు. ఆర్. కృష్ణయ్యపై గురుత్వర బాధ్యత ఉందని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆర్. కృష్ణయ్య తెలంగాణలో చేసే ప్రయత్నం ఢల్లీిలో కూడా చేయాలని కోరారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లని ఆర్. కృష్ణయ్య ఢల్లీికి తీసుకెళ్లి బీసీ రిజర్వేషన్ బిల్లుపై ప్రధానమంత్రి నరేంద్రమోదీతో చర్చించాలని సూచించారు. తాము కూడా మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. వారితో కలిసి ఢల్లీికి వచ్చి ప్రధాని మోదీని, రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. కాంగ్రెస్ బీసీ కులగణన చేసి, 42శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు. బీసీలకు న్యాయం చేసి బీజేపీ క్రెడిట్ తీసుకున్న తమకు నష్టం లేదని చెప్పుకొచ్చారు. కేబినెట్‌లో బీసీ రిజర్వేషన్ బిల్లుకి ఆమోదం తెలిపి గవర్నర్‌కి పంపించామని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ అంశంపై ఏఐసీసీ ఇన్‌చార్జ్ విూనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్‌గౌడ్ చర్చిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్‌లో స్వాతంత్రం ఉంటుందని ఉద్ఘాటించారు. అప్పుడప్పుడూ సమస్యలు వస్తాయని.. అవి సద్దుమనుగుతాయని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్‌లో నియంత పాలన ఉండదని.. సమస్యలన్నీ సద్దుమనుగుతాయని తెలిపారు. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలేనని, టీ కప్పులో తుఫాన్ లాంటివేనని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
బంద్‌కు జాగృతి సంపూర్ణ మద్దతు : కవిత
బీసీ బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల కోసం తాను పోరాడతానని ఉద్ఘాటించారు. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో 18వ తేదీన బీసీ సంఘాలు బంద్‌కి పిలుపునిచ్చాయి. బీసీ రిజర్వేషన్లు ఆమోదించాలంటూ బీసీ సంఘాలు ఆందోళన నిర్వహించనున్నాయి. ఈ క్రమంలో బీసీల బంద్‌కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలపాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య లేఖ రాశారు. అయితే, ఆర్. కృష్ణయ్య లేఖపై స్పందించారు కవిత. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ పాస్ చేసిన బిల్లులను ఆమోదించకుండా నెలల తరబడి పెండిరగ్‌లో పెట్టిన బీజేపీ ఇప్పుడు బంద్‌లో పాల్గొంటోందని… అంటే బీసీ రిజర్వేషన్ల బిల్లులు పాస్ చేసినట్లు భావించాలా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీ, కౌన్సిల్‌లో బిల్లులు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వంపై కొట్లాడకుండా బీసీ రిజర్వేషన్లపై ఉత్తుత్తి జీవో ఇచ్చిన కాంగ్రెస్ తామే ముందుండి బంద్ చేయిస్తామనడం హాస్యాస్పదంగా ఉందని కవిత విమర్శించారు.