బూర్గంపహాడ్ కు పోలవరం ప్యాకేజీ ప్రకటించాలి.
– గోదావరిలో నిరసన వ్యక్తం చేసిన బూర్గంపాడు ఎస్సీ కాలనీ వాసులు.
బూర్గంపహాడ్ ఆగష్టు14 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్
మండల కేంద్రానికి పోలవరం ప్యాకేజీ ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ఎస్సీ కాలనీ వాసులు గోదావరిలో దిగి నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం గోదావరిలో మోకాలు లోతులో దిగి ప్రభుత్వాలు తమ గోడును వినాలని బూర్గంపహాడ్ కు పోలవరం ప్యాకేజీ ప్రకటించాలని వారు నినాదాలు చేశారు. సురక్షితమైన, మైదాన ప్రాంతాల్లో తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఇప్పటివరకు కిన్నెరసాని, గోదావరి నది పరివాహక ప్రాంతాల వరదలతో మండల కేంద్రం ముంపుకు గురైందని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన మరింత ముంపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారని వారు తెలిపారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల గత నెలలో వచ్చిన గోదావరి వరద వల్ల మండల కేంద్రం లో ప్రధానంగా ఎస్సీ కాలనీ మరింత ముంపుకు గురై సర్వం కోల్పోయారని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముంపు వాసులకు మైదాన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. పినపాక శాసనసభ్యులు, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తమ గోడుకు పరిష్కారం చూపాలని వారు అన్నారు. ప్రధానంగా ఎస్సీ కాలనీ మరింత ముంపుకు గురై సర్వం కోల్పోయి నిరాశ్రయులుగా మారారని వారన్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్యాకేజీ ప్రకటించాలని వారు అన్నారు. పాలక ప్రభుత్వాలు తమ పై దృష్టి సారించాలని, తమ గోడు కు పరిష్కారం చూపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సీ కాలనీ వాసులు తోకల రవి, ప్రసాద్, కేసుపాక రామకృష్ణ, గ్రామపంచాయతీ వార్డ్ మెంబర్ కేసుపాక లీలావతి, మాజీ వార్డ్ మెంబర్ కేసుపాక బూబమ్మ , ఇసంపల్లి వెంకటేశ్వర్లు, కేసుపాక రవివర్మ, అలవాల దుర్గా ప్రసాద్, తోకల శీను, బండ్ల శోభనాద్రి తదితరులు పాల్గొన్నారు.