బెల్టు షాపుల ఎత్తివేతపై చిత్తశుద్ది ఏది?

సిఎం చంద్రబాబు నిజాయితీగా వ్యవహరించాలి

ఏలూరు,జూలై19(జ‌నం సాక్షి): జానావాసాల మధ్య ఏర్పాటు చేసిన మద్యం షాపులను ఎత్తేసేంత వరకు పోరాటం ఆగదని పలువురు మహిళా నాయకులు పేర్కొన్నారు. జనావాస ప్రాంతాల్లో మద్యం షాపులను తొలగించాలని డిమాండ్‌ చేసారు. బెల్టు షాపులను ఎత్తేస్తామని సిఎం ప్రకటించిన విధంగా ముందుకు సాగాలన్నారు. అందుకు ఐద్వా మద్దతుగా నిలుస్తుందన్నారు. బడి, గుడి చర్చి, మసీదు అంటూ ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా మద్యం షాపులు ఏర్పాటు చేస్తున్నారన్నారు. జనావాస ప్రాంతాల్లో మద్యం షాపుల నిషేదంపై మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించాలన్నారు. మద్యం నిషేధంపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం దుర్మార్గం అన్నారు. ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చి రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్‌గా మార్చేస్తోందన్నారు. జిల్లాలో తాగడానికి మంచి నీళ్లు దొరకని పరిస్థితి ఉన్నా, మద్యానికి మాత్రం కొదవ లేదన్నారు. జనావాస ప్రాంతాల్లో మద్యం షాపులను ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. జనావాస ప్రాంతాల్లోని మద్యం షాపులన్నింటినీ శివారు ప్రాంతాలకు తరలించాలన్నారు. లేని పక్షంలో ప్రత్యక్ష దాడులకు సిద్ధమవుతాయమన్నారు. నూతన ఎక్సైజ్‌ విధానం పేరుతో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారన్నారు. జనావాస ప్రాంతాల్లో తాగుబోతుల వీరంగానికి మహిళలు పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మద్యం నిషేధం మహిళల సమస్య ఒక్కటే కాదన్నారు. ఇది సామాజిక సమస్య అన్నారు. జాతీయ రహదారులపై ఉన్న మద్యం షాపులు తొలగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ప్రభుత్వం దొడ్డిదారిని వాటిని ఏర్పాటు చసేందుకు చర్యలు తీసుకోవడం సరికాదన్నారు.

 

తాజావార్తలు