బైరాన్ పల్లి గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

స్వాతంత్ర్య సమరయోధులకు పించను ఇప్పించేందుకు కృషి చేస్తాం
– తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలి సై సౌందరరాజన్
ధూల్మిట్ట (జనంసాక్షి) నవంబర్ 10 : బైరాన్ పల్లి గ్రామాన్ని పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు, స్వాతంత్ర్య సమరయోధులకు,అమరవీరుల కుటుంబాలకు పించను ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిలి సై సౌందరరాజన్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా దూలిమిట్ట మండలం వీర బైరాన్ పల్లి గ్రామంలో చారిత్రాత్మక బూరుజును సందర్శించారు. అనంతరం స్వాతంత్ర సమరయోధులను గవర్నర్ తమిలి సై సన్మానించారు. బైరాన్ పల్లి అమరవీరులకు నివాళులర్పించారు. గ్రామంలో అమరవీరుల కుటుంబాలకు, స్వతంత్ర సమరయోధులకు పెన్షన్ ఇప్పించి పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతూ బైరాన్ పల్లి గ్రామస్తులు గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిఫై మాట్లాడుతూ.. చారిత్రాత్మక వీర బైరాన్ పల్లిని సందర్శించడం, హైదరాబాద్ స్వాతంత్ర సమర యోధులను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా హైదరాబాద్ సంస్థానంలో రజాకార్లు కొనసాగించిన దుశ్చర్యలను వీర బైరాన్ పల్లి వీరులు వీరోచితంగా ఎదుర్కొని  తమ ప్రాణాలను అర్పించి హైదరాబాద్ సంస్థానం విముక్తికి బాటలు వేశారని, తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రత్వాల సందర్భంగా రాజ్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఈ గ్రామ విద్యార్థిని ద్వారా గ్రామ చరిత్రను తెలుసుకున్నానని, ఆమె విజ్ఞప్తి మేరకు గ్రామాన్ని సందర్శించనని తెలిపారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు అమరవీరుల కుటుంబాలకు స్వాతంత్ర సమరయోధుల పించను ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్ స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన వీర బైరాన్ పల్లి చరిత్ర అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థులు, యువత బైరాన్ పల్లి అమరత్వం గురించి తెలుసుకోవడం మూలంగా వారిలో దేశభక్తి భావం పెంపొందుతదని, గ్రామాన్ని అందరు సందర్శించేలా పర్యటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.

తాజావార్తలు