బోదకాలు వ్యాధిగ్రస్తులకు ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ

టేకులపల్లి, నవంబర్ 10 (జనం సాక్షి): స్థానిక వైద్యాధికారి విద్యాసాగర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ జాతీయ కీటక జనిత వ్యాధుల నివారణ విభాగం ద్వారా మండలంలోని 31 మంది బోదకాలు వ్యాధిగ్రస్తులకు ఆసరా పెన్షన్ పొందడానికి ఆసరా కార్డులు ఎంపీపీ భూక్య రాధ పంపిణీ చేశారు. గురువారం సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి విద్యాసాగర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ పాల్గొని ఆసరా పెన్షన్లు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. అదేవిధంగా బోదకాలు చికిత్సకు ఉపశమనం పొందడానికి కావలసిన వారికి ప్రత్యేకంగా బకెట్, మగ్గు, డెటాల్, సబ్బు,ఆయింట్ మెంట్,టవల్ కూడా అందజేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతూ కేవలం దోమకాటు ద్వారా వ్యాపించే ఈ వ్యాది పట్ల వ్యాధిగ్రస్తులతోపాటు మిగతా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాలు వీధులలో నీటి నిల్వలు లేకుండా అత్యంత పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు పెరగడానికి అవకాశం ఉన్న అన్ని అవకాశాలను నిర్మూలించాలని, ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే కార్యక్రమాలు పాటించాలని, దోమలు కుట్టకుండా చూసుకోవడం ద్వారా దోమ కాటు ద్వారా వచ్చే డెంగ్యూ, చికెన్ గున్యా,మలేరియా, బోదకాలు,మెదడువాపు తదితర వ్యాధుల నుండి కాపాడుకోవచ్చు అని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి ఉండేటి ప్రసాద్, స్థానిక సర్పంచులు మాలోత్ సురేందర్, అజ్మీరా బుజ్జి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సీతమ్మ,ఇల్లందు సబ్ యూనిట్ అధికారి హరికృష్ణ,సూపర్వైజర్లు నాగు బండి వెంకటేశ్వర్లు, వీసం శకుంతల తదితరులు పాల్గొన్నారు.