బ్యాంకాక్ లో పడవ పేలుడు: 60 మందికి గాయాలు
బ్యాంకాక్: నీటిపై ఇళ్లు, వాటి మధ్య వీధులు, పడవలపైనే దుకాణాలు.. ‘వెనిస్ ఆఫ్ ది ఈస్ట్’ గా పేరుపొందిన ధాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో శనివారం ఘోర పడవ ప్రమాదం జరిగింది. నగరంలోని వాట్ థెప్లీలా పెర్ ప్రాంతంలో ప్రయాణికుల పడవ ఇంజన్ పేలిపోవడంతో 60 మంది గాయపడ్డారు. బోటులో జనం కిక్కిరి ప్రయాణిస్తున్న సమయంలో ఇంజన్ ఒక్కసారిగా పేలిపోయిందని, మంటలు చెలరేగటంతో వెనుక భాగంలో కూర్చున్న ప్రయాణికులు పలువురు తీవ్రంగా గాయపడ్డారని అయితే ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు చెప్పారు.
పేలుడు ధాటికి ప్రయాణికులు చెల్లాచెదురుగా నీళ్లలో పడిపోయారని ప్రత్యక్షసాక్షలు తెలిపారు. గాయపడ్డవారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని, తీవ్రంగా గాయపడ్డ 14 మంది తప్ప మిగతవారు ప్రాథమిక చికిత్స అనంతరం వెళ్లిపోయారని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రమాదానికి గురైన బోటు సీన్ సేబ్ కెనాల్ నుంచి బ్యాంకాక్ నగరం మీదుగా చావ్ ప్రయా నది వరకు వెళ్లాల్సి ఉండగా మధ్యలోనే ప్రమాదానికి గురైంది. బ్యాంకాక్ లో ప్రతిరోజు దాదాపు లక్ష మంది ప్రయాణికులు పడవలపై ప్రయాణిస్తుంటారు.