బ్యాక్టీరియాతో వర్షాలు కురిపిస్తారట!
కొన్ని రకాల బ్యాక్టీరియా వల్ల వ్యాధులు వస్తాయని.. మరికొన్ని జీవన క్రియల్లో ఉపయోగపడతాయని అందరికీ తెలుసు. మరి అలాంటి బ్యాక్టీరియాలతో వర్షాలను కురిపించొచ్చని మీకు తెలుసా? నిజమే.. ‘సూడోమనాస్ సిరింగాయ్’ అనే బ్యాక్టీరియాతో కృత్రిమ వర్షాలు కురిపించే వీలుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. జర్మనీలోని ‘మ్యాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాలిమర్ రీసెర్చ్’కు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు.
మేఘాలు అధిక ఎత్తులో ఉన్నప్పుడు ఐస్ ఏర్పడడానికి సుడోమనాస్ సిరింగాయ్ రకం బ్యాక్టీరియా ప్రేరేపిస్తుందట. ఆ తర్వాత మేఘాలు చల్లబడి వర్షం కురుస్తుందట. ఇలా మేఘాలపై ఈ బ్యాక్టీరియాను వదలడం ద్వారా కృత్రిమ వర్షాలు కురింపించే అవకాశం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. కరవు ప్రాంతాల్లో ఈ విధానం ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు.
వర్షాల కోసం యూఏఈలో ఓ భారీ పర్వతాన్ని నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా బ్యాక్టీరియాతో కృత్రిమ వర్షాలను కురిపించే వీలుందని జర్మనీ శాస్త్రవేత్తలు గుర్తించడం ఆసక్తిగా మారింది. మరి ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.