బ్రిటిష్ ఉగ్రవాదులను దేశంలోకి రానివ్వం
జిహాదీలుగా మారి ఇరాక్ వెళ్లి తిరిగి బ్రిటన్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్న 200 మంది ఉగ్రవాదులను దేశంలోకి అడుగుపెట్టకముందే హతమార్చేందుకు రంగం సిద్ధమైంది. ఐసిస్‌తో కలిసి పోరాడుతున్న బ్రిటన్ జిహాదీల జాబితాను స్పెషల్ ఎయిర్ సర్వీసెస్(ఎస్ఏఎస్) తయారు చేసింది. ఈ జాబితాలో ఉన్న 12 మంది బ్రిటిన్ యూనివర్సిటీల నుంచి ఎలక్ట్రానిక్స్‌లో పట్టాలు అందుకున్నవారు కావడం గమనార్హం. ఈ 12 మంది బాంబుల తయారీలో నిపుణులని ఎస్ఏఎస్ తెలిపింది. ఇరాక్, కుర్దిష్ సేనల ధాటికి ఐసిస్ తోకముడిచే సమయం దగ్గరపడుతుండడంతో బ్రిటన్ జిహాదీలు తిరిగి ఇంగ్లండ్ చేరుకుని దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ విధ్వంసానికి ప్రణాళిక రచించినట్టు ఎస్ఏఎస్ వెల్లడించింది. ఈ ఉగ్రవాదులు ఇరాక్ విడిచి వెళ్లకుండా ఆపేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించాలని ఇరాక్ సేనలను కోరింది. బ్రిటన్ జిహాదీల్లో ఎవరైనా సజీవంగా పట్టుబడితే వారిని ఇరాక్ అధికారులకు అప్పగించాలని, దోషులుగా తేలితే మరణశిక్ష విధించాలని కోరింది. వందలాది మంది బ్రిటిష్ ఉగ్రవాదులు తిరిగి బ్రిటన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.