భక్తులను ఇబ్బందులు పెట్టొద్దు
– మహాసంప్రోక్షణ సమయంలోనూ దర్శనానికి అనుమతివ్వండి
– గతంలో ఆచరించిన విధానాన్నే అనుసరించండి
– టీటీడీకి పాలక వర్గానికి సూచించిన ఏపీ సీఎం చంద్రబాబు
– 24న తుది నిర్ణయం తీసుకుంటాం
– టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘ్వాల్
తిరుమల, జులై17(జనం సాక్షి): తిరుమల శ్రీవారి ఆలయంలో పన్నెండేళ్లకు ఒకసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువు సందర్భంగా చెలరేగిని వివాదంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. టీటీడీ నిర్ణయంపై అనేక అపోహలు, విమర్శలు తలెత్తాయి. దీనివెనక మర్మం ఏమై ఉంటుందా అన్నా అనుమానాలు బలంగా చెలరేగాయి. దీంతో వీటికి అడ్డుకట్ట వేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగారు. మహా సంప్రోక్షణను ఆగస్టు 11 నుంచి 16 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆరు రోజుల పాటు భక్తులకు పూర్తిగా శ్రీవారి దర్శనం నిలిపి వేయనున్నట్టు టీటీడీ పాలక మండలి శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తిరుమల పుణ్యక్షేత్రంలో ఆగమ శాస్త్రానుసారమే పూజా కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు టీటీడీ, సీఎంవో అధికారులను ఆదేశించారు. తిరుమల ఆలయంలో మహా సంప్రోక్షణపై ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం అధికారులతో చర్చించారు. గతంలో మహా సంప్రోక్షణలో పాటించిన నిబంధనలనే అనుసరించాలని సూచించారు. రోజుల తరబడి భక్తులు దర్శనానికి ఎదురుచూసేలా చేయరాదని అన్నారు. మహా సంప్రోక్షణ రోజుల్లో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించాలని సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని.., పూజాది కార్యక్రమాలకు అవాంతరాలు కలుగకూడదని అధికారులకు స్పష్టం చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలను నిర్వహించుకోవాలని సూచించారు. దీంతో టిటిడి కూడా సానుకూలంగా స్పందించింది.
24న తుది నిర్ణయం తీసుకుంటాం :ఈవో అనిల్‌కుమార్ సింఘాల్
మహాసంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని కొద్దిరోజుల పాటు పూర్తిగా మూసివేయాలని తీసుకున్న నిర్ణయంపై విచారణ చేస్తామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ ప్రకటించారు. తమ నిర్ణయాన్ని పునఃసవిూక్షిస్తామని తెలిపారు. ఈలోగా భక్తులు తమ అభిప్రాయాలు తెలియజేయాలని సింఘాల్ కోరారు.
మంగళవారం విూడియాతో మాట్లాడుతూ ఈ నెల24న టీటీడీ బోర్డు సమావేశం ఉన్నందున అప్పటిలోగా భక్తుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. మహా సంప్రోక్షణ సమయంలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించినా ఎక్కువ సంఖ్యలో వస్తే మిగిలిన వారు ఇబ్బంది పడతారనే ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిపై సోషల్‌విూడియాలో జరుగుతున్న ప్రచారంపై ఈవో అసంతృప్తి వ్యక్తం చేశారు. దర్శనం రద్దుపై నిర్ణయాలను పున:సవిూక్షించాలని సీఎం ఆదేశించారని ఈవో తెలిపారు. మహాసంప్రోక్షణ సమయంలో రోజుకు 3-4 గంటల పాటు రెండు విడతలుగా దర్శనం కల్పించాలా యోచిస్తున్నట్లు తెలిపారు. టీటీడికు భక్తుల ప్రయోజనాలే ముఖ్యమని.. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇబ్బంది కలిగించేలా ఉంటే మార్చుకునేందుకు వెనుకాడబోమన్నారు. భక్తుల అభిప్రాయాలను బట్టి 24న నిర్ణయం తీసుకున్నాకైనా సోషల్‌విూడియాలో ఆరోపణలు ఆగుతాయని ఆశిస్తున్నట్లు ఈవో అన్నారు. ఆగస్టు 11న 9 గంటలు, 12న 4 గంటలు, 13న 4 గంటలు, 14న 5గంటలు,
ఆగస్టు 15న 5గంటలు, 16న 4గంటలు మాత్రమే దర్శనం కల్పించవచ్చని ఈవో సింఘాల్ పేర్కొన్నారు.
తితిదే నిర్ణయం సరికాదు – శారదా పీఠాధిపతి
తిరుమలలో మహా సంప్రోక్షణ సందర్భంగా స్వామివారి దర్శనానికి భక్తులను పూర్తిగా అనుమతించరాదన్న టీటీడీ పాలకమండలి నిర్ణయం సరికాదని విశాఖలోని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. చాతుర్మాస దీక్షలో భాగంగా హృషికేశ్‌లో ఉన్న స్వరూపానంద వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ.. ఈ నిర్ణయం తీసుకునే ముందు పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆగమశాస్త్ర పండితులు, అర్చక స్వాములతో చర్చించకుండా పాలక మండలి వ్యవహరించిన తీరు సరికాదన్నారు. దేవాలయాల వైదిక కార్యక్రమాల్లో పాలకమండళ్లు జోక్యం చేసుకుని భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకోరాదన్నారు. మరోవైపు మహా సంప్రోక్షణ సమయంలో పరిమితంగా భక్తులను అనుమతించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వరూపానందేంద్ర సరస్వతి స్వాగతించారు. ప్రజాస్వామ్య ప్రభుత్వ అధినేత అయిన ముఖ్యమంత్రి పాలక మండలి నిర్ణయాన్ని సరిచేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.