భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నచంద్రబాబు

అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహణ
స్వామి తీర్థప్రసాదలు అందించి ఆశీర్వదించిన పండితులు
చంద్రబాబుతో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య భేటీ

భద్రాద్రి కొత్తగూడెం,జూలై29(జనంసాక్షి ): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ అర్చకులు, ఈఓ శివాజీ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. నాడు సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో శ్రీ సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. దాదాపు 19 సంవత్సరాల తర్వాత టీడీపీ అధినేత శుక్రవారం భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయంలోని శ్రీలక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండతులతో చంద్రబాబు వేదాశీర్వచనం పొందారు. అనంతరం స్వామివారి జ్ఞాపిక, స్వామి వారి లడ్డు ప్రసాదాలను చంద్రబాబుకు ఆలయ ఈఓ అందజేశారు.
చంద్రబాబు నాయుడు గురువారం అర్ధరాత్రి భద్రాచలం చేరుకున్నారు. బూర్గంపాడు నుంచి అర్థరాత్రి ఒంటి గంటకు భద్రాచలం చేరుకున్న చంద్రబాబుకు దారిపొడవునా జననీరాజనం పలికారు. జనం ఉత్సాహం చూసి చంద్రబాబు… ఓపికగా వారితో మాట్లాడారు. తెలుగు జాతి ఉన్నంత కాలం ఎన్టీఆర్‌ పేరు చరిత్రలో నిలిచి ఉంటోందన్నారు. ఐటీసీ, సింగరేణి కి తెలుగుదేశం పాలనలో ఎంతో ప్రోత్సాహం అందించానని గుర్తుచేశారు. హైటెక్‌ సిటీ, జీనోమ్‌ వ్యాలీతో హైదరాబాద్‌ కు బ్రాండ్‌ ఇమేజ్‌ తెలుగుదేశం పాలనలోనే వచ్చిందన్నారు. తెలుగుజాతి కోసం నిరంతరం పనిచేస్తానని చెప్పారు. భద్రాచలం వద్ద కరకట్ట నిర్మాణంతో తెలుగుదేశం పాలన దూరదృష్టి ఏంటో తెలిసిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 2002లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కరకట్ట నిర్మాణం జరిగింది. ఉమ్మడి ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్మించిన కరకట్ట భద్రాద్రి వాసుల పాలిట శ్రీరామరక్షగా నిలిచిందని ఈ సందర్భంగా చంద్రబాబుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు మాట్లాడుతూ… 20ఏళ్ల క్రితం కట్టిన కరకట్టను ప్రజలు ఈనాటికీ గుర్తుపెట్టుకోవటం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్‌ హయాంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఈ సమస్యను స్వయంగా పరిశీలించానని చెప్పుకొచ్చారు. చేసిన అభివృద్ధి సామాజిక సేవా శాశ్వతంగా ఉండటం ఎంతో తృప్తి నిస్తోందని తెలిపారు. భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉన్న చిన్నపాటి లోటుపాట్లను ప్రభుత్వం శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. విలీన గ్రామాల్లో కరకట్టల నిర్మాణం చేపట్టి బాధిత ప్రజలకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని చంద్రబాబు సూచించారు. చంద్రబాబును భద్రాచలం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పొదేం వీరయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఐదు విలీన గ్రామాలు తిరిగి తెలంగాణలో కలిపేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా చంద్రబాబును పొదేం వీరయ్య విజ్ఞప్తి చేశారు. ఐదు విలీన గ్రామాలు తిరిగి తెలంగాణలో కలిపేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా చంద్రబాబును పొదేం వీరయ్య విజ్ఞప్తి చేశారు. మరోవైపు భద్రాచలంలో తెలంగాణ పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. తెలంగాణ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులతో విడిగా సమావేశమయ్యారు. వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నారు. స్థానికంగా ఎదురయ్యే సమస్యలను నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. విలీన ఐదు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చంద్రబాబుకు వివరించారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు చొరవ చూపాలని నేతలకు టీడీపీ అధినేత సూచన చేశారు.
సెప్టెంబర్‌లో ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరుకావాలని నేతలు కోరగా… తప్పక హాజరవుతానని చంద్రబాబు హావిూ ఇచ్చారు. ఖమ్మం సభ తర్వాత తెలంగాణాలో పార్టీ పూర్వ వైభవానికి కలిసికట్టుగా పనిచేయాలని చంద్రబాబు దిశానిర్దేశర చేశారు. విలీన మండలాల్లో రెండోరోజు పర్యటన కొనసాగింది. ఎటపాక, కూనవరం, విఆర్‌ పురం మండలాల్లోని తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో బాబు పర్యటన సాగనుంది. ముంపు బాధితుల్ని పరామర్శించి వారి సమస్యలను చంద్రబాబు తెలుసుకున్నారు.

తాజావార్తలు