భాజపా మోసాన్ని దేశమంతా ఎండగట్టాలి
– ఎంపీల పోరాటంపైనే ప్రజలందరి దృష్టి
– వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేంద్రాన్ని నిలదీయండి
– కాపు రిజర్వేషన్లు షెడ్యూల్ 9లో చేర్చేలా ఒత్తిడి తీసుకురండి
– కాపు రిజర్వేషన్లపై జగన్ మోసాన్ని నిలదీయండి
– కేసుల మాఫీ కోసమే జగన్ తాపత్రయం
– టీడీపీ ఎంపీల వీడియోకాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి, జులై30(జనం సాక్షి) : రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజల ఆశలన్నీ పార్లమెంట్‌పైనే ఉన్నందున… ఎంపీలంతా హక్కుల సాధన కోసం ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని, తద్వారా కేంద్రాన్ని నిలదీసీ భాజపా తీరును దేశవ్యాప్తంగా ఎండగట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపీలకు దిశా నిర్దేశం చేశారు. టీడీపీ ఎంపీలతో సోమవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అన్నివైపుల నుంచి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని సూచించారు. పార్లమెంటులో హావిూలు ఇచ్చారని ఇప్పుడు చేయలేమని అఫిడవిట్లు వేస్తున్నారని మండిపడ్డారు. కడప ఉక్కు తరహాలోనే రైల్వేజోన్‌పై పోరాటం తీవ్రం చేయాలని ఎంపీలకు చంద్రబాబు ఆదేశించారు. ప్రజాక్షేత్రంలో, పార్లమెంటులో పోరాటం చేయాలని, కేంద్రంపై ఒత్తిడి పెంచాలని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని వేదికలపై బీజేపీ మోసాన్ని ఎండగట్టాలని బాబు అన్నారు. కాపు రిజర్వేషన్ల చట్టం కేంద్రం వద్ద తొమ్మిది నెలలుగా పెండింగ్‌లో ఉందని తెలిపారు. కాపు రిజర్వేషన్లను షెడ్యూల్ తొమ్మిదిలో చేర్చాలని ఒత్తిడి తేవాలని ఎంపీలకు తెలిపారు. కాపు రిజర్వేషన్లపై జగన్ మోసాన్ని నిలదీయాలన్నారు. జగన్ దృష్టంతా కేసుల మాఫీపైనే అని విమర్శించారు. ప్రకాశం నిమ్జ్‌పై దుష్పచ్రారాన్ని తిప్పికొట్టాలని, నిమ్జ్‌కు అవసరమైనవి ఇస్తామన్నా కేంద్రం నాలుగేళ్లుగా నాన్చుతోందని టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు అన్నారు. ఎస్సీ, ముస్లిం మైనారిటీలు భాజపాకు పూర్తిగా దూరమయ్యారని.. అలాంటి భాజపాతో జగన్ అంటకాగుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఒంగోలు ధర్మపోరాట సభ విజయవంతమైందని…, ప్రజల స్పందన ఎలా ఉందో అంతా గమనించారని సీఎం చెప్పారు. ఎంపీలు కేంద్రాన్ని నిలదీసే సమయంలో ఎక్కడా వెనుకడుగు వేయవద్దని, వచ్చిన అవకాశంతో కేంద్రం ఏపీ పట్ల వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఏపీలో మొబైల్ ఏటీఎంలు ప్రారంభం..
పౌరుల్లో ఆర్ధిక అక్షరాస్యత, డిజిటల్ బ్యాంకింగ్ పరిజ్ఞానం పెంచాలనే లక్ష్యంతో రాష్ట్రంలో మొబైల్ ఏటీఎంలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రారంభించారు. నాబార్డు సాయంతో మొబైల్ ఏటీఎంలను ఆప్కాబ్ కంపెనీ ప్రవేశపెట్టింది. 12 జిల్లాల్లో 12 మొబైల్ ఏటీఎంలు ఏర్పాటు చేశారు. మొబైల్ ఏటీఎంలలో మైక్రో ఏటీఎం, పేటిమ్, క్యాష్ విత్ డ్రా, క్యాష్ డిపాజిట్ సదుపాయాలు కల్పించారు. మరే రాష్ట్ర సహకార బ్యాంకింగ్ వ్యవస్థకు లేని ఏటీఎం వ్యవస్థ ఏపీకి ప్రత్యేకం. రైతాంగానికి నగదు కొరత లేకుండా చర్యలు చేసుకుంటామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు.
——————————————–