భారత్‌కు తిరిగొచ్చే ఆలోచనలో విజయ్‌ మాల్యా!

– న్యాయ విచారణ ఎదుర్కొనేందుకు సిద్ధం
– వెల్లడిస్తున్న అధికార వర్గాలు
న్యూఢిల్లీ, జులై25(జ‌నంసాక్షి) : బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా భారత్‌కు తిరిగి రావాలనుకుంటున్నారని అధికారిక వర్గాల నుంచి సమాచారం. మాల్యా స్వదేశానికి తిరిగి వచ్చి న్యాయ విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ మేరకు మాల్యా తన ప్రతినిధులను దర్యాప్తు సంస్థల వద్దకు పంపి ఈ విషయాన్ని చెప్పినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌లోని అధికారులు వెల్లడించినట్లు సమాచారం. ప్రస్తుతం మాల్యాపై లండన్‌లోని కోర్టులో విచారణ జరుగుతోంది. భారత ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్‌ కింద విచారణ ఎదుర్కోవడానికి మాల్యా సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ ఆర్డినెన్స్‌ ద్వారా ప్రభుత్వం మాల్యా ఆస్తులను వెంటనే జప్తు చేసే అవకాశం ఉంటుంది. పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్‌ కింద మాల్యాపై చర్యలు తీసుకోవాలని ఈడీ ఇటీవల ముంబయిలోని అవినీతి నిరోధక చట్టం ప్రత్యేక న్యాయస్థానాన్ని కోరింది. దీంతో కోర్టు ఆగస్టు 27న న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని మాల్యాకు
సమన్లు జారీ చేసింది. మాల్యా బ్యాంకులకు దాదాపు రూ.9వేల కోట్లు ఎగ్గొట్టగా.. ఈ ఆర్డినెన్స్‌ ద్వారా ఆయనపై చర్యలు తీసుకుంటే మాల్యాకు చెందిన రూ.12,500కోట్లు జప్తు చేసుకునే అధికారం ఉంటుంది. కోర్టు సమన్లు జారీ చేసిన ప్రకారం..మాల్యా చెప్పిన తేదీకి కోర్టు ఎదుట హాజరుకాకపోతే మాల్యాను పారిపోయిన ఆర్థిక నేరగాడుగా ప్రకటించే అవకాశం ఉంది. మాల్యాపై ఈడీ, సీబీఐ వేర్వేరుగా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.