భారత్‌ను అణ్వస్త్ర దేశంగా తీర్చిన వాజ్‌పేయి

ద వాషింగ్టన్‌ పోస్ట్‌’ హెడ్‌లైన్‌లో ప్రశంసలు

పాక్‌,భారత్‌ స్నేహానికి వాజ్‌పే కృషి: డాన్‌ ప్రశంసలు

న్యూఢిల్లీ,ఆగస్ట్‌17(జ‌నం సాక్షి ): భారత రత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి మరణవార్తను విదేశీ విూడియా కూడా బాగా ప్రచారం చేసింది. ఆయా దేశాల నేతలు నివాళి అర్పించగా, విూడియా కూడా ఈ వార్తకు ప్రాధాన్యం ఇచ్చింది. భారత దేశాన్ని మాత్రమే కాదు ప్రపంచాన్ని వాజ్‌పేయ్‌ మరణవార్త కదిలించింది. సోషల్‌ విూడియాలో ఇదో ప్రధాన వార్తగా ప్రసారం అయ్యింది. నెటిజన్లు బాగా స్పందించారు. ఆయనను అభిమానించేవారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. లక్షలాదిమంది ఆయనకు నివాళుల ర్పిస్తున్నారు. అంతర్జాతీయ విూడియా కూడా ఆయనకు శ్రద్దాంజలి ఘటించింది. ద వాషింగ్టన్‌ పోస్ట్‌’ హెడ్‌లైన్‌లో భారతదేశాన్ని అణ్వాయుధ శక్తిగా తీర్చిదిద్దిన ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి 93 ఏళ్ళ వయసులో దివంగతులయ్యారని పేర్కొంది. డాన్‌ న్యూస్‌ పాకిస్థాన్‌కు చెందిన పత్రిక అయినప్పటికీ వాజ్‌పేయి కృషిని ప్రశంసించింది. పాకిస్థాన్‌తో అద్భుతమైన శాంతి పక్రియను ఆయన ప్రారంభించారని పేర్కొంది. భారతదేశ రాజకీయాల్లో అత్యంత అరుదైన వ్యక్తి వాజ్‌పేయి అని, ఆయన అవినీతి మచ్చలేని నేత అని ప్రశంసించింది. బీబీసీ విూడియా వాజ్‌పేయిని పాదరసం లాంటి మృదు స్వభావిగా అభివర్ణించింది. భారతదేశ తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్‌ నెహ్రూకు బలమైన ప్రత్యర్థిగా వ్యవహరించారని పేర్కొంది. పార్లమెంటులో వాజ్‌పేయి ఓసారి నెహ్రూ గురించి మాట్లాడిన మాటలను ప్రస్తావించింది. నెహ్రూ యోగాభ్యాసం చేస్తూ తల విూద అతిగా నిల్చోవడం వల్ల ఆయనకు తలక్రిందులు దార్శనికత ఉంది అని వాజ్‌పేయి అన్నట్లు పేర్కొంది. ది గార్డియన్‌’ పత్రిక వాజ్‌పేయికి నివాళులర్పిస్తూ చాలాసార్లు కఠినంగా కనిపించిన హిందూ జాతీయవాద ఉద్యమ మితవాద నేత, రాజకీయ వైరుద్ధ్యం వాజ్‌పేయి అని పేర్కొంది. పోఖ్రాన్‌ అణు పరీక్షలతో పాకిస్థాన్‌తో యుద్ధ భయాన్ని కలిగించారని, అయితే పొరుగు దేశం పాకిస్థాన్‌తో శాంతి కోసం తొలి ప్రయత్నం కూడా ఆయనే చేశారని పేర్కొంది. ద న్యూయార్క్‌ టైమ్స్‌’ కూడా పోఖ్రాన్‌ అణు పరీక్షలను ప్రస్తావించింది. అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచాన్ని నిర్ఘాంతపరిచారని పేర్కొంది. అదే సమయంలో పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలను తేలికపరిచేందుకు కృషి చేశారని పేర్కొంది. ప్రపంచంలో అత్యధిక జనాభా కల దేశానికి తాతయ్యలాంటి వ్యక్తి అని వాజ్‌పేయిని అభివర్ణించింది. అత్యధికంగా హిందువులు ఉన్న దేశంలో ముస్లింలు, కైస్త్రవులకు సమాన హక్కులకు ఆయన మద్దతిచ్చారని ప్రశంసించింది.