భారత్‌ను ప్రగతి బాటలో పయనింపచేస్తాం
-అసోం ఘర్షణలు జాతికి కళంకం
-వచ్చే ఐదేళ్లలో ప్రతీ గ్రామానికి నిరంతర విద్యుత్
-రెండేళ్లలో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్లు
-త్వరలో రాజీవ్ గృహ రుణ పథకం
-జాతినుద్ధేశ్యించి ప్రసంగించిన ప్రధాని
న్యూఢిల్లీ: భారతదేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి శాయశక్తులా కృషి చేస్తానని ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్ బుధవారం పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 66 సంవత్సరాలలో దేశం ఎంతో అభివృద్ధి చెందిదని, ఆర్థిక మాంద్యం ప్రపంచాన్ని కమ్మేసినా భారత్‌పై ఇంతవరకూ పెద్దగా ప్రభావం పడలేదన్నారు. అసోం ఘర్షణలు జాతికి కళంకం అని, అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. మహాత్మగాంధీ ఆధ్వర్యంలో జరిగిన అహింసాయుత పోరాట ఫలితంగా దేశానికి స్వతంత్య్రం సిద్దించిందన్నారు. కరవు ప్రాంతాలలో అన్నదాతను ఆదుకుంటామని, ప్రభుత్వాసుపత్రిలో ఉచిత వైద్యం అందిస్తామన్నారు. వచ్చే ఐదేళ్లలో ప్రతీ గ్రామానికి నిరంతరం విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేస్తామన్నారు. పారిశ్రామిక వర్గాలు కూడా అందుకు సహకరించాలని కోరారు. నిర్భందా విద్య చట్టాన్ని పక్కాగా అమలు చేస్తామని చెప్పారు. రాబోయే రెండేళ్లలో ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్లు తెరుస్తామని తెలిపారు. దేశ óవృద్ధి రేటులో గణనీయమైన అభివృద్ధి సాధించామని, త్వరలో రాజీవ్ గృహ రుణ పథకం ద్వారా పేదలకు ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. పేదలు, రైతులు, కార్మికులకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు కృషి చేస్తున్నామన్నారు. లోక్‌పాల్ బిల్లు తీసుకువచ్చేందుకు, నక్సల్స్ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామన్నారు. దేశ అభివృద్ధికి సత్వర చర్యలు అవసరమనొ, పోలియోను పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తామన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి చర్యలు చేపట్టిందని చెప్పారు. గిరిజన, వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటిస్తామన్నారు. దేశంలో పేదరికం, దారిద్య్రం తొలగించినపుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని పేర్కొన్నారు.