భారత్‌- రష్యాల మధ్య బలపడ్డ బంధం

167

– ఇరుదేశాధినేతల చర్చలు

– పలుకీలక ఒప్పందాలపై సంతకాలు

పనాజి,అక్టోబర్‌ 15(జనంసాక్షి):రష్యాతో భారత్‌ బంధం మరింత బలపడింది. మళ్లీ కొత్త అధ్యాయం ప్రారంభమయ్యింది.  ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాద్‌మిర్‌ పుతిన్‌ సమక్షంలో ఇరు దేశాల మధ్య 10 ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు.  బ్రిక్స్‌ ఎనిమిదో వార్షిక శిఖరాగ్ర సదస్సు కాసేపట్లో గోవాలో ప్రారంభం కానుండగా, ముందు వివిధ దేశాధినేతలతో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. గోవాలో జరిగిన ద్వైపాక్షిక భేటీలో ఈ ఒప్పందం జరిగింది. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ నిర్వహించిన చర్చలు తర్వాత పలు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. రెండు దేశాల మధ్య 18 ఒప్పందాలు కుదిరిన్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక అభివృద్ధి మండలి-రష్యా మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో రవాణా, నౌకానిర్మాణ రంగాలపై కూడాఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆకర్షణీయ నగరాల అభివృద్ధిలో రష్యా సహకరించనుంది. ఏపీ తరఫున రష్యాతో ఒప్పందంపై జాస్తి కృష్ణకిశోర్‌ సంతకం చేశారు. అలాగే నాగపూర్‌-సికింద్రాబాద్‌ మధ్య హైస్పీడ్‌ రైళ్లపై రష్యాతో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది.   రష్యాకు చెందిన ఎస్‌-400 క్షిపణులపై భారత్‌తో ఒప్పందం కుదిరింది.కూడంకుళంలోని అణురియాక్టర్‌కు చెందిన మూడవ, నాలుగవ యూనిట్లను పుతిన్‌, మోదీలు సంయుక్తంగా బటన్‌ నొక్కి ప్రారంభించారు. ఇద్దరు కొత్త స్నేహితులకన్నా ఒక పాత స్నేహితుడే బెటర్‌ అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. పాకిస్థాన్‌, చైనాలకు కూడా రష్యా మిసైళ్లను అమ్మాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మోదీ రష్యాతో పాత స్నేహ బంధాన్ని గుర్తు చేసినట్లు తెలుస్తోంది. సీమాంతర ఉగ్రవాదం వల్ల యావత్‌ ఆసియా ప్రాంతమంతా ప్రమాదకరంగా మారిందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. పుతిన్‌ సహాకారం వల్ల రష్యాతో మరింత స్నేహ బంధాన్ని పెంచుకోనున్నట్లు మోదీ చెప్పారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న రష్యా సహకారంతో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కవిూషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని తెలిపారు. రష్యాతో ఆర్థిక బంధాన్ని మరింత పటిష్టం చేయనున్నట్లు మోదీ చెప్పారు. ఉగ్రవాదంపై రష్యాకు ఉన్న అభిప్రాయమే తమ సంకేతమని మోదీ అన్నారు. రెండు దేశాల పరిశ్రమల మధ్య సహకారం పెరిగిందని, మిలిటరీ, టెక్నికల్‌ రంగాల్లోనూ సహకారం పెరిగిందని పుతిన్‌ అన్నారు. 5 బిలియన్ల డాలర్లు విలువ చేసే ఎస్‌-400 మిసైళ్ల కొనుగోలుపైన కూడా ఒప్పందం జరిగింది.  ఇండియా-రష్యాల మధ్య ప్రతినిధులస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.  బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గోవా చేరుకున్న విషయం తెలిసిందే. ఈమేరకు గోవాలో భారత్‌, రష్యాల మధ్య ప్రతినిధుల స్థాయి సమావేశం ప్రధాని మోదీ, వ్లాదిమిర్‌ పుతిన్‌ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఇరు దేశాల మధ్య ధైపాక్షిక సమావేశం గురించి చర్చించారు. అనంతరం పుతిన్‌ బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొననున్నారు.